ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. 61 ఏళ్ల రికార్డు పై రిషబ్ పంత్ కన్ను..
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.

ENG vs IND 4th test Rishabh pant eye on 61 year old record
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో గనుక పంత్ మరో 101 పరుగులు చేస్తే.. ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
ప్రస్తుతం ఈ రికార్డు కుందరన్ పేరిట ఉంది. 1964లో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. అప్పుడు కుందరన్ 10 ఇన్నింగ్స్‌ల్లో 525 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఓ అర్థశతకం ఉంది. అంతేకాదండోయ్.. ఓ టెస్టు సిరీస్‌లో 500కు పైగా పరుగులు సాధించిన ఏకైక భారత వికెట్ కీపర్ కూడా కుందరనే కావడం గమనార్హం.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో పంత్ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో (134, 118) సెంచరీలు చేశాడు. ఆ తరువాత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 25, 65, 74, 9 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో 425 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా ఉన్నాడు.
ఒక వేళ పంత్ 101 పరుగులను మాంచెస్టర్‌లో సాధించకపోయినప్పటికి కూడా అతడికి మరో అవకాశం ఉంది. జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు ఓవల్ వేదికగా జరిగే మ్యాచ్‌లో కూడా ఛాన్స్ ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిపి పంత్ 101 పరుగులు సాధించడం ప్రస్తుతం అతడు ఉన్న ఫామ్‌తో పెద్ద కష్టం ఏమీ కాదు. అప్పుడు 61 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.
ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్లు వీరే..
* కుందరన్ – ఇంగ్లాండ్ పై 5 మ్యాచ్‌ల్లో 525 పరుగులు (1964లో)
* రిషబ్ పంత్ – ఇంగ్లాండ్ పై 3 మ్యాచ్‌ల్లో 425 పరుగులు (2025లో)
* ఫరూఖ్ ఇంజినీర్ – ఇంగ్లాండ్ పై 5 మ్యాచ్‌ల్లో 415 పరుగులు (1972లో)
* రిషబ్ పంత్ – ఆస్ట్రేలియాపై 4 మ్యాచ్‌ల్లో 350 పరుగులు (2018లో)