Eng Vs Ind: ఫలితంపై తీవ్ర ఉత్కంఠ.. భారత్ గెలవాలంటే 3 వికెట్లు, ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు..

మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.

Eng Vs Ind: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ ఫలితం రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిది అనేది ఉత్కంఠ రేపుతోంది. సిరీస్ ఫలితం 5వ రోజున తేలిపోనుంది. నాలుగో రోజు ఆట వెలుతురు లేమి కారణంగా నిలిచిపోయింది. అంతలోనే వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 35 పరుగులు దూరంలో ఉంది. భారత్ గెలవాలంటే 3 వికెట్లు తీయాల్సి ఉంది. మరి 5వ రోజు ఆటలో ఏం జరగనుంది? అనేది టెన్షన్ పెడుతోంది.

374 పరుగుల టార్గెట్ తో 50/1తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) శతకాలు బాదారు. ఆదివారమే మ్యాచ్ ఫలితం తేలేలా కనిపించింది. అయితే, వెలుతురు లేమి ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించాయి. మైదానంలో కప్పిన కవర్లపై భారీగా నీరు నిలవడంతో నాలుగో రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు అంపైర్లు. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 35 పరుగులు అవసరం. జేమీ ఒవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజులో ఉన్నారు. సిరీస్‌ను 2-2తో ముగించాలంటే ఆఖరి రోజు భారత బౌలర్లు అద్భుతం చేయాల్సిందే.

ఈ మ్యాచ్ లో ఒకదశలో భారత్ గెలుపు ఆశలు చిగురించాయని చెప్పాలి. సెంచరీతో దూకుడు మీదున్న ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (105) ను ప్రసిద్ధ్ కీలక సమయంలో ఔట్ చేశాడు. భారత్ గెలవాలంటే మరో 3 వికెట్లు తీయాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్ లో భారత్ 224 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 247 రన్స్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో జో రూట్, హ్యారీ బ్రూక్ సెంచరీలతో కదం తొక్కారు. బ్రూక్ 98 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. రూట్ 152 బంతుల్లో 105 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు తీశారు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు.