2019 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు బయటకు వచ్చేశాక అంబటి రాయుడును జట్టులోకి తీసుకోకపోవడంపై బీసీసీఐ సెలక్టర్లపై అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఇంగ్లాండ్‌లో ప్రపంచ కప్ ఆడటానికి వెళ్ళిన టీమ్ ఇండియా, ఈ టోర్నమెంట్‌లో కప్ గెలిచే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో టాప్ 3 బ్యాట్స్ మెన్లు తక్కువ స్కోరు కొట్టడంలో కూడా విఫలం కావడంతో అప్పటికే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడును తీసుకోకపోవడంపై విమర్శలు ఎదుర్కొన్నారు.
అయితే అప్పుడు బీసీసీఐ కానీ, సెలక్టర్లు కానీ, ఆ విషయంపై స్పందించలేదు. ఇప్పడు 2019 ప్రపంచ కప్ జట్టు సెలెక్టర్, భారత మాజీ బ్యాట్స్‌మెన్ దేవాంబ్ గాంధీ రాయుడును దూరంగా ఉంచడం తప్పుడు నిర్ణయం అని అంగీకరించారు. ఆ టోర్నమెంట్‌లో టీం ఇండియాకు 4 వ స్థానంలో పర్మినెంట్ బ్యాట్స్‌మన్ లేడు. సెలెక్టర్లు ఇక్కడ యువ ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌పై నమ్మకం ఉంచారు. తరువాత రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చారు. “అది మా తప్పిదమే. తప్పు జరిగింది. కానీ మేము కూడా మనుషులమే. ఏది సరైన కాంబినేషన్ అనే విషయంలోనే పొరపాటు చేశాం. ఆ కోణంలోనే ఆలోచించాం. ఆ తర్వాత చేసిన పొరపాటు తెలుసుకున్నాం.” అని అన్నారు.
టీం ఇండియా సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న దేవాంగ్ గాంధీ ఇటీవల పదవీకాలం పూర్తి చేశారు. 2019 ప్రపంచ కప్‌కు టీమ్ ఇండియాను ఎంపిక చేసిన 5 మంది సభ్యుల ఎంపిక కమిటీలో ఆయన ఉన్నారు. ప్రపంచ కప్‌కు మేము జట్టును ఎన్నుకున్నప్పుడు, సెలక్షన్ కమిటీ ఉత్తమ జట్టును ఎన్నుకున్నట్లు అనిపించింది అని గాంధీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు. రాయుడు జట్టులో ఉండి ఉంటే, 4 వ స్థానం భర్తీ అయ్యేది. ముఖ్యంగా సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో జట్టుకు బలమైన బ్యాట్స్‌మన్ దొరికేవాడు.
భారత జట్టు సెమీస్‌లోనే నిష్క్రమించగా.. అక్కడ రాయుడు లేని లోటు కనిపించింది. ఈ సమయంలో అంబటి రాయుడు.. వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడటానికి తాను త్రీడీ కళ్లద్దాలను ఆర్డర్ చేశానంటూ సెటైర్ వేశాడు. దాంతో వివాదం మరింత తీవ్రతరం కాగా.. విజయ్ శంకర్ గాయం కారణంగా స్వదేశానికి వచ్చేసినా రాయుడుకు పిలుపు రాలేదు. అతని స్థానంలో రిషభ్ పంత్ ఇంగ్లండ్‌కు వెళ్లడం రాయుడికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఆ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రాయుడు వీడ్కోలు చెప్పేశాడు.