Gautam Gambhir dedicates T20 World Cup win to Dravid and Laxman
Gautam Gambhir : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా, స్వదేశంలో పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా.. ఈ విజయం పై టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ విజయాన్ని భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. తన విషయానికి వస్తే వ్యక్తిగత రికార్డుల కంటే ఐసీసీ ట్రోఫీలే ముఖ్యం అని అన్నాడు.
భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన తరువాత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ప్రపంచకప్ సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
‘టీ20 ప్రపంచకప్ విజయాన్ని రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్‌లకు అంకితం ఇస్తున్నాము. భారత క్రికెట్ కోసం రాహుల్ ద్రవిడ్ చేసిన కృషి వెలకట్టలేనిది. ప్రస్తుతం జట్టు ఇలా ఉందంటే అందుకు అతడే కారణం. అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీని లక్ష్మణ్ నడిపిస్తున్న తీరు వల్ల అద్భుతమైన యువ ఆటగాళ్లు లభిస్తున్నారు. సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు ధన్యవాదాలు. ముఖ్యంగా ఐసీసీ ఛైర్మన్ జై షా కృతజ్ఞుడిని. దక్షిణాఫ్రికా, సౌతాఫ్రికా సిరీస్‌లలో మేం ఓడిపోడి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో నాకు మొదటి ఫోసి మద్దతు ఇచ్చి వ్యక్తి జై షా. నాపై ఎంతో నమ్మకం ఉంచారు. ‘అని గంభీర్ అన్నాడు.
కోచ్‌ను లేదా కెప్టెన్ ను గొప్ప వాళ్లు చేసేది ఆటగాళ్లేనని చెప్పుకొచ్చాడు. వారే మైదానంలో పోరాడి ట్రోఫీని గెలుస్తారని అన్నాడు. ఇక ఈ గెలుపు క్రెడిట్ వారిదే. ఇందులో తనది కానీ, కెప్టెన్‌గా సూర్యది గానీ ఏం లేదన్నాడు. జట్టులో ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్లేనని తెలిపాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు ఆడిన ఇన్నింగ్స్‌లు అద్భుతం అని కొనియాడాడు.
వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలే ఎంతో ముఖ్యం అని గంభీర్ అన్నాడు. గతంలో వ్యక్తిగత మైలురాళ్లను అతిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్లని చెప్పుకొచ్చాడు. ఆ పంథాను తాను మార్చానని, తన వరకు ఐసీసీ ట్రోఫీలే అన్నింటికన్నా ముఖ్యం అని చెప్పుకొచ్చాడు. తాను కోచ్‌గా ఉన్నంత కాలం ఇదే సిద్ధాందాన్ని అనుసరిస్తానని చెప్పుకొచ్చాడు.
‘కొన్నిసార్లు ఆ మనస్తత్వాన్ని మార్చుకోవడం చాలా కష్టం. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వారందరూ ఆ మనస్తత్వాన్ని అంగీకరించారు. గత సంవత్సరం లేదా రెండు సంవత్సరాలలో 97 లేదా 98లో ఎవరైనా సింగిల్ కోసం ప్రయత్నించినట్లు నాకు గుర్తు లేదు. ఎందుకంటే ఈ డ్రెస్సింగ్ రూమ్‌లో.. 97 లేదా 98 చేసినా కూడా.. సెంచరీకి సమానమైన ప్రశంసలు పొందుతారు. జట్టు స్కోరును 250, 270, 280 తీసుకువెళ్లాలంటే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే ఏకైక మార్గం. అందరూ కూడా తమ కంటే జట్టే ముఖ్యం అని అనుకుంటున్నారు. ఇందుకు చాలా గర్వంగా ఉంది.’ అని గంభీర్ అన్నాడు.