Gautam Gambhir : చరిత్ర దయతో ఉంటుంది.. అజిత్ అగార్కర్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో గంభీర్ పోస్ట్.. వైరల్..
గత నెలలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి అజిత్ అగార్కర్ వైదొలిగిన నేపథ్యంలో ఆయన సేవలను ప్రశంసిస్తూ టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ (Gautam Gambhir) సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- October 7, 2026 / 04:00 PM IST
Gautam Gambhir Post For Ajit Agarkar Takes Internet By Storm
Gautam Gambhir : గత నెలలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి అజిత్ అగార్కర్ వైదొలిగిన నేపథ్యంలో ఆయన సేవలను ప్రశంసిస్తూ టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు. సెలెక్షన్ వ్యవహారాలతో పాటు యువ ప్రతిభావంతులను జాతీయ జట్టులోకి తీసుకురావడంలో అగార్కర్‌తో కలిసి పనిచేసిన గంభీర్.. ఆయనపై ప్రశంసలు కురిపించారు.
అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో భారత జట్టు రెండు టీ20 ప్రపంచకప్‌లు (2024, 2026), ఒక ఛాంపియన్స్ ట్రోఫీ (2025)ని గెలుచుకుంది. అయినప్పటికి కూడా అగార్కర్ పదవీకాలం చివరి దశలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం, ఆ తర్వాత రోహిత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించాలన్న చర్చలు అగార్కర్‌పై విమర్శలకు కారణమయ్యాయి.
రోహిత్ స్థానంలో యశస్వి జైస్వాల్‌కు వన్డేల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అగార్కర్ భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్‌కు మద్దతుగా నిలిచారని, వచ్చే ఏడాది ప్రపంచకప్ వరకు అతడు వన్డేల్లో కొనసాగాలని బీసీసీఐ కోరుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీసీసీఐ, అగార్కర్ మధ్య విభేదాలు వచ్చాయని పలు కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో గంభీర్ అగార్కర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘డియర్ అజిత్ భాయ్.. మీతో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఆ మూడు ఐసీసీ ట్రోఫీలు మీ నిబద్ధతకు నిదర్శనం. ఎప్పుడూ జట్టే ముందు.. జట్టే అన్నింటికంటే ముఖ్యం. ఒక్క విషయం మాత్రం చెప్పాలి.. చరిత్ర మీ గురించి మరింత గొప్పగా చెబుతుంది. ప్రతిదానికి ధన్యవాదాలు. మీ భవిష్యత్ ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.’ అని గంభీర్ తెలిపాడు.
గంభీర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అగార్కర్ ఎదుర్కొన్న పరిస్థితులపై గంభీర్ చేసిన వ్యాఖ్యల్లో లోతైన అర్థం ఉందంటూ పలువురు చర్చించుకున్నారు.
అగార్కర్ పదవీకాలం..
2023 జూలైలో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ పర్యవేక్షణలో భారత్ ఒక స్వర్ణయుగాన్ని చైసింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరడం, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ గెలవడం ఆయన పదవీకాలంలోనే జరిగింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న ప్రస్తుత వైట్‌బాల్ సిరీస్‌కు జట్ల ఎంపికే ఆయన చివరి బాధ్యతగా నిలిచింది.
Dear Ajit Bhai, an absolute honour to work with you. Those 3 ICC trophies are testimony of your conviction: Team first & Team ahead, always.. I must say, History will be kinder to you. Thank you for everything. My heartfelt wishes for your future endeavours !! https://t.co/gYQN0fea8X
— Gautam Gambhir (@GautamGambhir) October 7, 2026
ప్రస్తుతం మాజీ భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్, మూడు ఇండియా-ఎ మ్యాచ్‌లకు జట్ల ఎంపిక ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. సెలెక్షన్ ప్యానెల్‌లో ఓజాతో పాటు శివసుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్పీ సింగ్ ఉన్నారు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం సెలెక్షన్ ప్యానెల్‌లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన వ్యక్తి చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. భారత్ తరఫున 24 టెస్టులు ఆడిన ప్రజ్ఞాన్ ఓజా ప్రస్తుతం ప్యానెల్‌లో సీనియర్‌గా ఉన్నారు.
