నరైన్‌ ఇక రెస్ట్ తీసుకో..: వరల్డ్ కప్ జట్టులో గేల్… రస్సెల్

ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి జరగనున్న వరల్డ్ కప్ టోర్నీ కోసం కరేబియన్ వీరులు సిద్ధమైపోతున్నారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తీసుకుందో.. ప్రస్తుతమున్న జాతీయ జట్టు ఆటగాళ్లు రాణించగలరనే నమ్మకం కోల్పోయిందో సీనియర్లు అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. 

విధ్వంసక వీరుడు క్రిస్ గేల్, కోల్‌కతాతో పోరాటంలో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తున్న రస్సెల్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అనూహ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మరో ప్లేయర్ సునీల్ నరైన్‌ను మాత్రం పక్కకు పెట్టేసింది. దానికి తగ్గ కారణం లేకపోలేదు. ఐపీఎల్ 2019కు రావడానికి ముందే కుడి చేతి మధ్య వేలికి గాయమైంది. ఈ కారణంతోనే నరైన్ జట్టుకు దూరమైయ్యాడు. 

దీనిపై స్పందించిన నరైన్ ‘వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి తీసుకునేందుకు సెలక్టర్లు నా పేరును పరిశీలించారు. అందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడి చాలా కాలమైనప్పటికీ నా మీద నమ్మకం ఉంచారు. కానీ,  చేతి వేలి గాయంతో టోర్నీకి ఆడలేకపోతున్నాను. ఐపీఎల్‌లో 4ఓవర్లు బౌలింగ్ వేయడానికి ఫిజియో సాయం తీసుకోవాల్సి వస్తుంది. దీని కోసం సర్జరీ చేయించుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు. 

వెస్టిండీస్ వరల్డ్ కప్ జట్టు:
జాసన్ హోల్డర్, ఆండ్రీ రస్సెల్, ఆస్లే నర్సె, కార్లొస్ బ్రాత్‌వైట్, క్రిస్ గేల్, డారెన్ బ్రావో, ఎవిన్ లూయీస్, ఫాబియన్ అల్లెన్, కేమర్ రోచ్, నికోలస్ పూరన్, ఒషానె థామస్, షై మోప్, షానో గాబ్రియేల్, షెల్డన్ కాట్రెల్, షిమ్రోన్ హెట్‌మేర్