Gujarat vs Kolkata : వర్షార్పణం.. కోల్‌కతాతో మ్యాచ్‌ రద్దు.. ఫ్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్..!

గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ గ్రూప్ దశలో చివరి గేమ్‌ కాగా.. జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు

GT vs KKR Live Score, IPL 2024_ Match Abandoned ( Image Credit : @IPL_Twitter )

Gujarat vs Kolkata : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగాల్సిన గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు అయింది.

దాదాపు నాలుగు గంటలుగా వర్షం కురుస్తుండటంతో టాస్‌ కూడా ఆలస్యమైంది. వర్షంతో తడిసిన మైదానంలో కవర్లు పిచ్‌పై కప్పి ఉంచారు. ప్లడ్ లైట్లలో సమస్య కారణంగా పూర్తిగా ఆన్‌ చేయలేదు. 5-ఓవర్ల మ్యాచ్‌కి కట్-ఆఫ్ సమయం ఇచ్చినా ఎంతకి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో చివరికి మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫలితంగా కోల్‌కతా, గుజరాత్ జట్లకు చెరో పాయింట్ దక్కింది.

గుజరాత్ ఫ్లేఆఫ్స్ ఆశలు గల్లంతు :
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ గ్రూప్ దశలో చివరి గేమ్‌ కాగా.. జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. గత రెండు ఎడిషన్‌లలో వరుసగా ఫైనల్స్‌కు చేరుకున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు ఫ్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. ఎంతో కీలకమైన మ్యాచ్ రద్దు కావడంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో 11 పాయింట్లతో అధికారికంగా ఫ్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్‌లో గుజరాత్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించడంలో విఫలమైంది. మూడు మ్యాచ్‌ల పరాజయాల పరంపరలో చివరి గేమ్‌లో గుజరాత్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.

19 పాయింట్లతో అగ్రస్థానంలో కోల్‌కతా.. :
ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతూ పాయింట్ల పట్టికలో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 9 గెలిచి 3 ఓడి 19 పాయింట్లతో కోల్‌కతా అగ్రస్థానంలో నిలిచింది. ఐపీఎల్ ఎడిషన్‌లో ఫ్లేఆఫ్స్ చేరుకున్న తొలి జట్టుగా నిలిచిన కోల్‌కతా మ్యాచ్ రద్దుతో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. గుజరాత్ పాయింట్ల పట్టికలో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 7 ఓడి 11 పాయింట్లతో 8వ ప్లేసులో నిలిచింది. చివరి లీగ్ మ్యాచ్‌లో కేకేఆర్ రాజస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడినా పాయింట్ల పట్టికలో టాప్ 2 ప్లేసులో నిలుస్తుంది.

Read Also : Babar Azam : చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజాం.. ధోని, రోహిత్ కాదు.. టీ20 క్రికెట్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా..

ట్రెండింగ్ వార్తలు