Hardik Pandya-Shubman Gil
World Cup 2023 IND vs AUS : వన్డే ప్రపంచకప్ లో భాగంగా టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆదివారం అక్టోబర్ 8న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు షాకులు తగులుతున్నాయి. టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌గిల్ డెంగ్యూ బారిన పడగా, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆసీస్‌తో మ్యాచ్‌కు వీరిద్దరు అందుబాటులో ఉంటారో లేదో అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.
నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా..
ఆసీస్ తో మ్యాచ్ కోసం టీమ్ఇండియా సన్నద్దమవుతోంది. ఈ క్రమంలో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న హార్దిక్ పాండ్య కుడి చేతి వేలికి గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. అతడికి అయిన గాయం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే.. ఆ తరువాత హార్దిక్ బ్యాటింగ్ చేయలేకపోయాడని అంటున్నారు. దీనిపై బీసీసీఐ ఇప్పటి వరకు స్పందించలేదు. ఒకవేళ ఆసీస్‌తో మ్యాచ్ సమయానికి హార్దిక్ కోలుకోలేకపోతే టీమ్ఇండియాకు కష్టాలు తప్పవు.
Also Read : ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టు
అనారోగ్యం బారిన గిల్..
యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యం బారిన పడినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలియజేసింది. అయితే.. అతడికి ఏమైంది అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. అందుకున్న సమాచారం ప్రకారం గిల్ డెంగ్యూ బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆసీస్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడం అనుమానమే. సాధారణంగా డెంగ్యూ నుంచి కోలుకునేందుకు వారం నుంచి పది రోజుల సమయం పడుతుంది. దీంతో గిల్ పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ వరకు అందుబాటులో ఉండకపోవచ్చు.
ఆసీస్‌తో మ్యాచ్‌కు గిల్ దాదాపుగా దూరం అయినట్లే. దీంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగొచ్చు. రోహిత్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణల్లో ఉన్నట్లు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. అతడు త్వరలోనే కోలుకుంటాడని, వైద్యులు ఏం చెబుతారో వేచి చూడాలని అని, గిల్ ఆసీస్‌తో మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనే దానిపై శనివారం నిర్ణయం తీసుకుంటామన్నాడు.
Also Read: ప్రాక్టీస్ సెషన్ లో విరాట్ కోహ్లీ ఫన్నీ వీడియో వైరల్.. వాటర్ బాయ్ తరహాలో..