Rohit Sharma
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు చాన్నాళ్లుగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి నాయకత్వంలోనే ముంబై జట్టు ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. కాగా.. ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై నాలుగో స్థానంలో, అంతక ముందు సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2024 సీజన్‌కు అతడిని కెప్టెన్‌గా తప్పిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్థిక్ పాండ్య తిరిగి ముంబై జట్టులో చేరనున్నాడని అంటున్నారు.
ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ట్రేడింగ్ విండో ఒక్క రోజులో ముగుస్తుందనగా ప్రస్తుతం హార్దిక్ పాండ్య అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఏడేళ్ల పాటు హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ జట్టు ద్వారానే అతడు స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా సెలక్టర్ల దృష్టిని ఆక్షరించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
T20 World Cup 2024 : టీ20లకు హార్దిక్‌పాండ్య కెప్టెన్‌గా వద్దు.. అందుకు సరైనోడు అతడే : గంభీర్
రెండు సార్లు ఫైనల్‌కు..
అయితే.. 2022 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ పాండ్యను వదిలివేయగా.. గుజరాత్ టైటాన్స్ జట్టు అతడిని సొంతం చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అతడి నాయకత్వంలో గుజరాత్ జట్టు ఆడిన రెండు సంవత్సరాలు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. మొదటి సారి విజేతగా నిలవగా, రెండో సారి చెన్నై చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
అటు ముంబై ఇండియన్స్ నుంచి గానీ, ఇటు గుజరాత్ టైటాన్స్ నుంచి గానీ పాండ్య విషయమై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆటగాళ్ల పరస్పరం మార్చుకునే ప్రక్రియ ఆదివారం (నవంబర్ 26) సాయంత్రం వరకు గడువు ఉంది. దీంతో ఆ తరువాతనే ఈ విషయం పై ఓస్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా.. పాండ్యను ముంబై తీసుకుంటే అతడి స్థానంలో గుజరాత్‌కు ఏ ఆటగాడిని బదిలీ చేస్తారు అన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది.
రోహిత్ కెప్టెన్సీకి ఎసరు..?
ముంబై ఇండియన్స్ గనుక హార్దిక్ పాండ్యను సొంతం చేసుకుంటే అతడు రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడతాడా..? లేదంటే అతడే కెప్టెన్‌గా ఉంటాడా..? అన్న అంశం ఆసక్తిని కలిగిస్తోంది. రోహిత్ శర్మ వయస్సు దృష్టా అతడు మరో ఒకటి లేదా రెండు ఐపీఎల్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అతడు ఉండగానే పాండ్యకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని కొట్టిపారేయలేము. అటు హార్దిక్ ముంబైకి వస్తే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఏం జరగనుందనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.