Womens T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. గ్రూప్ స్టేజీలో తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 40) రాణించింది. టీమ్ఇండియా బౌలర్లలో రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు సాధించారు. శ్రేయాంక, పూజ వస్త్రాకర్, రాధా యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54 నాటౌట్; 47 బంతుల్లో 6 ఫోర్లు) ఆఖరి వరకు నిలిచినా జట్టును విజయతీరాలకు చేర్చడంలో విఫలమైంది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్, సోఫీ మోలనూ తలా రెండు వికెట్లు తీశారు.
టీమ్ఇండియా ఓటమిపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది. కీలక మ్యాచులో ఓడిపోవడం నిరాశకు గురి చేసిందని చెప్పింది. తనతో పాటు దీప్తిశర్మ క్రీజులో ఉన్నంత వరకు తాము విజయం సాధిస్తామనే భావించామంది. అయితే.. ఆసీస్ బౌలర్లు ఆఖరి ఓవర్లలో అద్భుతంగా బంతులు వేశారంది. పరుగులు చేయకుండా కట్టడి చేశారంది. ఆస్ట్రేలియాకు మిగిలిన జట్లకు అదే తేడా అంది.
ఒకరిద్దరిపైనే ఆసీస్ ఆధారపడదని చెప్పుకొచ్చింది. ఆ జట్టులో చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నారంది. ఆసీస్ జట్టులో అనుభవజ్ఞులు ఉన్నారని, ఒత్తిడి సమయంలో, ప్రపంచ కప్ మ్యాచుల్లో ఎలా ఆడాలో వాళ్లకు బాగా తెలుసని చెప్పింది. అయినప్పటికి తాము కూడా సరైన ప్రణాళికలతోనే బరిలోకి దిగామని, విజయం కోసం ఆఖరి వరకు ప్రయత్నించినట్లు తెలిపింది.
sanju samson: ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సులు కొట్టిన సంజూ శాంసన్ .. వీడియో వైరల్
పదకొండు మంది కలసి కట్టుగా ఆడితేనే విజయాలు వస్తాయని తెలిపింది. ఇక ఆసీస్ నిర్దేశించిన లక్ష్యం ఛేదించదగినదేనని, మిడిల్ ఓవర్లలో బౌండరీలు కొట్టకపోవడంతో ఒత్తిడి పెరిగినట్లు తెలిపింది. ఇక తాము సెమీస్‌కు చేరడం తమ చేతుల్లో లేదని, ఒకవేళ మాకు మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తే మాత్రం గొప్ప ప్రదర్శన చేస్తామని తెలిపింది.
టీమ్ఇండియా సెమీస్ చేరుకునేందుకు ప్రస్తుతం ఒకే ఒక్క దారి ఉంది. నేడు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్వల్ప తేడాతో విజయం సాధించాలి. అప్పుడు భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు 4 పాయింట్లతో ఉంటాయి. అయితే.. మెరుగైన రన్‌రేట్ ఉన్న భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.