భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లు తలపడితే ప్రపంచకప్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా స్టేడియంలు కిక్కిరిసిపోతాయి. ప్రపంచ కప్‌కే తలమానికమైన అలాంటి మ్యాచ్ పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కాస్త సందిగ్ధంలో పడింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సైతం ఈ ఘటన కారణంగా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిపే విషయమై సమాలోచనలు జరుపుతుంది.
ఈ క్రమంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుల్వామా ఉగ్రదాడి ఘటన అనంతరం పాకిస్తాన్ తో ప్రపంచ కప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ సరైనదేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని, వీటిలో ఒక్క మ్యాచ్ ఆడనంత మాత్రాన ఏమీ కాదంటూ పరోక్షంగా పాకిస్తాన్ తో మ్యాచ్ రద్దును గంగూలీ ప్రస్తావించాడు. అలాగే ఒక్క క్రికెటే కాదు ఆటలకు సంబంధించి మరేదైనా ఒప్పందాలు ఉన్నా పాకిస్తాన్ తో సంబంధాలు తెంచుకోవాలని గంగూలీ సూచించాడు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం రెండు దేశాల మధ్య సిరీస్‌కు అవకాశమే లేదని గంగూలీ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నియమిత కమిటీ పర్యవేక్షణలో ఉన్నందున బీసీసీఐ ప్రభావవంతంగా లేదని, అయినప్పటికీ పాకిస్తాన్ కు గట్టి సందేశం పంపాలని సూచించాడు. భారత్ లేకుండా ప్రపంచ కప్‌లో ఐసీసీ ముందుకెళ్లే ప్రసక్తే లేదంటూ ఆయన అన్నారు. ఇప్పటికే స్పిన్నర్ హర్బజన్ సింగ్ పాకిస్తాన్ తో ఎట్టి పరిస్థితిలో క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టగా తాజాగా గంగూలీ వ్యాఖ్యలతో అటువంటి పరిణామానికి గట్టి మద్దతు లభించే అవకాశం కనిపిస్తుంది.