IND vs PAK : భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు ముందు ఐసీసీ కీలక నిర్ణయం.. భారత్‌కు భారీ అడ్వాంటేజ్!
ఆదివారం కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాక్ (IND vs PAK) మ్యాచ్ జరగనుంది.
- Thota Vamshi Kumar
- Published On : February 14, 2026 / 01:09 PM IST
ICC Takes key Decision Ahead Of IND vs PAK Match in T20 World Cup 2026
IND vs PAK : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఇప్పటికే కొలంబో చేరుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మ్యాచ్‌కు ముందు కొలంబో మైదానంలో శనివారం రెండు జట్లు వేరు వేరు సమయాల్లో ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించనున్నట్లు ఐసీసీ ధ్రువీకరించింది. పాక్ జట్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననుంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననుంది.
భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఇటీవల ఉద్రిక్తతల దృష్ట్యా, ఆటగాళ్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా శిక్షణా సెషన్‌ల మధ్య ఒక గంట విరామం ఉండేలా ఐసీసీ చూసుకుని ఉండవచ్చు. అయితే.. రెండు జట్లు వేరు వేరు సమయాల్లో ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించడం అసాధారణం అయితే కాదు గానీ.. ప్రపంచకప్ వంటి టోర్నీల్లో మ్యాచ్‌లు ఆడే రెండు జట్లు దాదాపుగా ఒకే సమయంలో ప్రాక్టీస్ సెషన్లు నిర్వహిస్తూ ఉంటాయి.
భారత్‌కు అడ్వాంటేజ్?
సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించడం వల్ల భారత్‌కు కాస్త అదనపు ప్రయోజనం కలుగనుంది. ఎందుకంటే కొలంబోలోని లైట్ల కింద ఉండే పరిస్థితులకు భారత ఆటగాళ్లు అలవాటు పడనున్నారు. రాత్రి సమయంలో మంచు ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయడం ద్వారా బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లు అన్ని కూడా శ్రీలంక వేదికగానే జరగుతున్నాయి. ఇప్పటికే పాక్ జట్టు శ్రీలంకలో రెండు మ్యాచ్‌లు ఆడింది. కాబట్టి ఇక్కడి పరిస్థితులపై పాక్ కు స్పష్టమైన అవగాహన ఏర్పడి ఉంటుంది.
వర్షం ముప్పు..!
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తే ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు. మ్యాచ్ రద్దు అయితే ఐసీసీ, శ్రీలంక క్రికెట్ బోర్డుతో పాటు ప్రసారకులు భారీ నష్టాలను చవిచూస్తారు. వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే భారత్, పాక్ జట్లు తదుపరి దశ అయిన సూపర్-8కి అర్హత సాధిస్తాయి.
