Courtesy @BCCIWomen
India Women Defeat: ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ పరాజయాల పరంపరం కొనసాగుతోంది. మరో మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా వదులుకుంది. ఈ మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. 289 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 284 పరుగులకే పరిమితమై ఓటమి చవి చూసింది.
ఓసెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. మంచి ఆరంభం ఇచ్చింది. 94 బంతుల్లో 88 పరుగులు చేసింది. మరో ఎండ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సైతం హాఫ్ సెంచరీతో మెరిసింది. 70 బంతుల్లో 70 పరుగులు చేసింది. దీపి శర్మ సైతం ధనాధన్ బ్యాటింగ్ చేసింది. 57 బంతుల్లో 50 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ లో ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నా.. చివరలో వరుసగా వికెట్లు కోల్పోయారు. దానికి తోడు బౌండరీలు కొట్టకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో భారత జట్టు సెమీస్ అవకాశాలు కష్టంగా మారాయి.
ఇంగ్లండ్ తో మ్యాచ్ లో భారత జట్టు ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ చేతులారా ఓడిపోయిందని మండిపడుతున్నారు. 30 బంతుల్లో చేయాల్సింది 36 పరుగులే.. పైగా చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అయినా మ్యాచ్ గెలవలేకపోవడం దారుణం అంటున్నారు. ఇలాంటి ఆటతో భారత్ వరల్డ్ కప్ నెగ్గడం చాలా కష్టం అంటున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్ వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంద. దీంతో సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. అటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరాయి.
భారత్ సెమీస్ చేరాలంటే.. రాబోయే రెండు మ్యాచుల్లో (న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ) కచ్చితంగా గెలిస్తేనే ఇతర జట్ల ప్రదర్శనతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. ఒకవేళ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఓడితే బంగ్లాదేశ్ పై తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇతర జట్లతో పోలిస్తే మెరుగైన రన్ రేట్ ఉంటేనే భారత్ సెమీస్ చేరుతుంది.