IND vs PAK : ఇదేం ట్విస్ట్ సామీ.. భారత్, పాక్ మ్యాచ్ రద్దైతే.. మూడు జట్లు టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..
టీ20 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాక్ (IND vs PAK) మ్యాచ్ రద్దు అయితే మూడు టీమ్‌లు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తాయి
- Thota Vamshi Kumar
- Published On : February 15, 2026 / 12:27 PM IST
If Ind vs pak match washout then 3 team eliminate from T20 World cup 2026
IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా నేడు (ఆదివారం ఫిబ్రవరి 15)న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని శ్రీలంక వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం 70 నుంచి 80 శాతం ఉన్నట్లు అంచనా వేసింది.
మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ప్రేమదాస స్టేడియంలోని డ్రైనేజీ వ్యవస్థ అత్యుత్తమమైనది. వర్షం ఆగిన 20 నిమిషాల్లో మైదానాన్ని సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. భారీ వర్షం పడి ఔట్ ఫీల్డ్ చిత్తగా మారితే మాత్రం కష్టం కావొచ్చు.
మ్యాచ్ ఎప్పుడు రద్దు చేస్తారంటే?
సాధారణంగా టీ20 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. అప్పుడే మ్యాచ్ ఫలితం తేలుతుంది. వర్షం వల్ల కనీసం ఐదు ఓవర్లు కూడా నిర్వహించలేని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే మ్యాచ్‌ను రద్దు చేస్తారు.
రద్దైతే పరిస్థితి ఏంటి?
వర్షం కారణంగా భారత్, పాక్ మ్యాచ్ రద్దు అయితే.. ఇరు జట్లకు చెరొక పాయింట్ ను కేటాయిస్తారు. ఇది గ్రూప్ స్టేజీ మ్యాచ్ కావడంతో ఐసీసీ ఈ మ్యాచ్‌కు ఎలాంటి రిజర్వ్ డేను కేటాయించలేదు.
మ్యాచ్ రద్దైతే మూడు జట్లు ఇంటికే..
ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్, పాక్ జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించాయి. చెరో 4 పాయింట్లతో పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆదివారం జరగాల్సిన మ్యాచ్ రద్దైతే చెరో పాయింట్ ను ఇస్తారు. అప్పుడు ఇరు జట్ల ఖాతాలో 5 పాయింట్లు ఉంటాయి. దీంతో వారు సూపర్-8 దశకు చేరుకుంటారు.
అప్పుడు గ్రూప్-ఏలో మిగిలిన మూడు జట్లు అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాలు టోర్నీ నుంచి ఇంటి ముఖం పడుతాయి. ఎందుకంటే.. ఈ మూడు జట్లు లీగ్ దశలో తాము ఆడాల్సిన చివరి మ్యాచ్‌ల్లో విజయం సాధించినా కూడా భారత్, పాక్ పాయింట్లను దాటలేవు.
