IND vs AUS 4th T20 Mitchell Marsh Comments after australia lost match to India
Mitchell Marsh : క్వీన్స్‌లాండ్ వేదికగా గురువారం భారత్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమిపై ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) స్పందించాడు. లక్ష్య ఛేదనలో సరైన భాగస్వామ్యాలను నమోదు చేయకపోవడంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చిందన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (46) రాణించాడు. ఆ తరువాత 168 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్ (30), మాథ్యూ షార్ట్ (25) పర్వాలేదనిపించారు.
కాగా.. ఈమ్యాచ్‌లో ఓ దశలో ఆసీస్ 91/3తో సునాయసంగా గెలిపించేలా కనిపించింది. అయితే.. అనూహ్యంగా మరో 28 పరుగులకు మిగిలిన ఏడు వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, అక్షర్ పటేల్, శివమ్ దూబే లు చెరో 2 వికెట్లు తీశారు.
‘వాస్తవానికి ఈ పిచ్ పై 167 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించవచ్చునని అనుకున్నాను. అయితే.. బ్యాటింగ్‌లో కొన్ని సవాళ్లు ఎదురుఅయ్యాయి. లక్ష్య ఛేదనలో మంచి ఆరంభమే లభించింది. అయితే.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. లక్ష్య ఛేదనలో భాగస్వామ్యాలు ఎంతో ముఖ్యం. కనీసం రెండు మంచి భాగస్వామ్యాలు అన్నా కావాలి. ఈ విషయంలో మేము విఫలం అయ్యాం. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం. ‘అని మిచెల్ మార్ష్ అన్నాడు.
భారత్ చక్కగా ఆడిందని, గెలుపు క్రెడిట్ వారికే దక్కుతుందన్నాడు. కండిషన్స్‌కు తగ్గట్లుగా వారు బంతులు వేశారన్నాడు. ‘యాషెస్ సిరీస్ కారణంగా కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరం అయ్యారు. వారి స్థానాల్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం. ఇలాంటి మ్యాచ్‌ల ద్వారా వారు మరింత మెరుగు అవుతారు. ఇక చివరి మ్యాచ్‌లో జట్టులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.’ అని మార్ష్ తెలిపాడు.