Jasprit Bumrah
Jasprit Bumrah : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐదో వన్డే గబ్బా స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ సీరిస్‌లో 2-1తో టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, చివరి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సేన ఉవ్విళ్లూరుతోంది.
టీమిండియా స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో భారీ రికార్డుపై కన్నేశాడు. బుమ్రా ఒక్క వికెట్ పడగొడితే టీ20 ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని అందుకోనున్నాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పనున్నాడు. అదే సమయంలో మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.
ఇప్పటి వరకు ఏ టీమిండియా బౌలర్ మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీయలేదు. అయితే, టీ20 ఫార్మాట్లో మాత్రం అర్షదీప్ సింగ్ మాత్రమే ఇప్పటి వరకు 100 వికెట్లు (67 మ్యాచ్‌ల్లో 105 వికెట్లు) పూర్తిచేశాడు. ప్రస్తుతం బుమ్రా 79 టీ20 మ్యాచ్‌లలో 99 వికెట్లు తీశాడు. మరొక్క వికెట్ తీయడం ద్వారా సరికొత్త చరిత్రను సృష్టించనున్నాడు. అంతేకాకుండా ఇతను భారత్ తరఫున టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా బుమ్రా నిలవనున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ (108 మ్యాచ్‌లలో 182 వికెట్లు) నిలిచాడు.
ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన బౌలర్లలో లసిత్ మలింగ (టెస్టుల్లో 101, వన్డేల్లో 338, టీ20ల్లో 107), షకిబ్ అల్ హసన్ (టెస్టుల్లో 246, వన్డేల్లో 317, టీ20ల్లో 149), టీమ్ సౌథీ (టెస్టుల్లో 391, వన్డేల్లో 221, టీ20ల్లో 164), షహీన్ అఫ్రీది (టెస్టుల్లో 121, వన్డేల్లో 132, టీ20ల్లో 122) వికెట్లు పడొగొట్టారు. జస్ర్పీత్ బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగే చివరి టీ20 మ్యాచ్ లో ఒక వికెట్ తీయడం ద్వారా ఈ జాబితాలో చోటు దక్కించుకోనున్నాడు.