Tilak – Nitish : ‘నువ్వు వచ్చేసేయ్’..! ‘రేయ్ రెండు అని చెప్పురా’..!! కివీస్‌తో మ్యాచ్‌లో తిలక్, నితీశ్ ఆసక్తికర సంభాషణ.. వీడియో వైరల్
Tilak - Nitish : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ విజయంలో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ కీలక భూమిక పోషించారు. అయితే, వీరిద్దరూ క్రీజులో ఉన్న సమయంలో తెలుగులో మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Harish Thanniru
- Published on- October 25, 2026 / 09:10 AM IST
Tilak - Nitish
Tilak – Nitish : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం రెండో టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఓటమి అంచుల్లో ఉన్న జట్టును తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ (51 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (26నాటౌట్) అద్భుత ఆటతీరుతో విజయతీరాలకు చేర్చారు. ఈ జోడీ ఏడో వికెట్ కు అజేయంగా 69 పరుగులు జోడించారు. అయితే, వీరిద్దరూ క్రీజులో ఉన్న సమయంలో తెలుగులో మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అంతర్జాతీయ మ్యాచ్‌లో.. అందులోనూ విదేశీ గడ్డపై నితీశ్ రెడ్డి, తిలక్ వర్మ తెలంగాణ యాసలో మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో తొలి బంతి తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. స్ట్రైక్‌లో ఉన్న తిలక్ వర్మ మాట్లాడుతూ..‘‘నువ్వు కాల్ ఇవ్వలేదు..’’ అనగానే, నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న నితీశ్ రెడ్డి వెంటనే.. ‘‘నువ్వు వచ్చేసేయ్.. నేను వచ్చేస్తా ఆరాంసే’’ అని తెలిపాడు. దీనికి తిలక్.. ‘‘రేయ్ రెండు అని చెప్పురా పోనీ.. నేను ముందొచ్చి వెయిట్ చేస్తున్నా నీకోసం’’ అని గట్టిగా అరుస్తూ చెప్పడం కనిపించింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ మైక్ స్టంప్‌లో రికార్డరవ్వడంతో మాటలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, మ్యాచ్ తరువాత కూడా వారిద్దరూ మైదానంలో సరదాగా మాట్లాడుకున్న వీడియో వైరల్ గా మారింది.
ఈ మ్యాచ్ లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. ఫిలిప్స్ (70), జేకబ్స్ (58) పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి విజయం సాధించింది. భారత జట్టు బ్యాటర్లలో అభిషేక్ (21 బంతుల్లో 27), తిలక్ వర్మ (51నాటౌట్), నమన్ (31), నితీశ్ కుమార్ (26నాటౌట్) రాణించారు.
