Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్..
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు (Yashasvi Jaiswal) ఐసీసీ భారీ షాకిచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 24, 2026 / 04:28 PM IST
IND vs SL 2nd Test ICC fines Yashasvi Jaiswal and Asitha Fernando 25 per cent match fee
Yashasvi Jaiswal : టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. అతడిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా విధించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. యశస్వితో పాటు శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండోకు కూడా ఇదే శిక్షను ఐసీసీ విధించింది.
అసలేం జరిగిందంటే ?
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్లు రెండో టెస్టు మ్యాచ్‌లో తలపడుతున్నాయి. తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్, అసిత ఫెర్నాండోల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారత తొలి ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో యశస్వి జైస్వాల్‌ను ఔట్ చేసిన తరువాత అసిత ఫెర్నాండో అత్యుత్సాహం ప్రదర్శించాడు.
ఈ క్రమంలో జైస్వాల్ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో జైస్వాల్ హెల్మెట్ అసిత ఫెర్నాండో నుదుటికి తాకింది. మైదానంలో పరిస్థితి చేయి దాటిపోతుండడంతో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, ఇతర ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దారు.
ఈ ఘటనపై ఐసీసీ స్పందించింది. ప్రవర్తనా నియమావళిలోని లెవెల్-1ను ఈ ఇద్దరు ఆటగాళ్లు ఉల్లంఘించినట్లు తేల్చింది. ఈ క్రమంలో యశస్వితో పాటు ఫెర్నాండోకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా విధించింది. అంతేకాదండోయ్ ఇద్దరి ఖాతాలో చెరో డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
ఒక ఆటగాడు 24 నెలల వ్యవధిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లను పొందినప్పుడు, వాటిని సస్పెన్షన్ పాయింట్లుగా మార్చి, ఆ ఆటగాడిపై నిషేధం విధిస్తారు. ఒక టెస్ట్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల్లో వీటిలో ఏది ముందుగా ఉంటే ఆ మ్యాచ్‌ల్లో నిషేదం పడుతుంది. డీమెరిట్ పాయింట్లు ఒక ఆటగాడి లేదా ఆటగాడి సహాయక సిబ్బంది యొక్క క్రమశిక్షణా రికార్డులో వాటిని విధించిన తేదీ నుండి ఇరవై నాలుగు (24) నెలల పాటు ఉంటాయి ఆ తర్వాత వాటిని తొలగిస్తారు.
