IND vs SL : దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ.. ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా భారత్..
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs SL) భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది.
- Thota Vamshi Kumar
- Updated on- August 23, 2026 / 05:46 PM IST
IND vs SL 2nd Test stumps day 1 Team India 300 runs loss of 5 wickets
IND vs SL : కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ (117; 193 బంతుల్లో 12 ఫోర్లు)తో చెలరేగడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్ (7), సారాంశ్ జైన్ (4)లు ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 18 పరుగులు మాత్రమే చేసిన కేఎల్ రాహుల్ జట్టు స్కోరు 37 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45; 53 బంతుల్లో 9 ఫోర్లు) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నప్పటికి కూడా గత మ్యాచ్ హీరో దేవ్‌దత్ పడిక్కల్ మరోసారి చెలరేగి ఆడాడు.
Shubman Gill : టెస్టుల్లో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత..
Stumps: It is Stumps on Day 1 in Colombo and India are 300/5 from 85 overs.
Devdutt Padikkal scored another fine century, whereas Gill made 50.
Link: https://t.co/r9FgXSdsMf #TeamIndia | #SLvIND pic.twitter.com/OTuvZSUvjY
— BCCI (@BCCI) August 23, 2026
అతడి ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు క్లిష్టమైన క్యాచ్‌లను లంక ఆటగాళ్లు వదిలివేయడాన్ని సద్వినియోగం చేసుకున్న పడిక్కల్ ఆచితూచి ఆడాడు. అసలు సిసలైన టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ముందు యశస్వి జైస్వాల్, ఆ తరువాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (50; 108 బంతుల్లో 6 ఫోర్లు) లతో చక్కని భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతకంతో చెలరేగి వన్‌డౌన్ స్థానానికి తానే సరైన వాడినని నిరూపించుకున్నాడు.
వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వ్యక్తిగత స్కోరు 3 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇంకొద్ది సేపటిలో తొలి రోజు ఆట పూర్తి అవుతుందనగా రవీంద్ర జడేజా (43; 83 బంతుల్లో 4 ఫోర్లు) ఔట్ అయ్యాడు. ధ్రువ్ జురెల్, సారాంశ్ జైన్ లు మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించారు.
