IND vs WI : చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్..
ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (IND vs WI ) విజయం సాధించి భారత్ సెమీస్‌లో అడుగుపెట్టింది.
- Thota Vamshi Kumar
- Published On : March 2, 2026 / 09:00 AM IST
IND vs WI Sanju Samson breaks Virat Kohlis all time record in T20 World Cup
- విండీస్ పై మ్యాచ్ విన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్
- 97 పరుగులతో అజేయంగా
- కోహ్లీ రికార్డు బ్రేక్
IND vs WI : టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ శాంసన్ అదరగొట్టాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియా సెమీ ఫైనల్ కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఛేజింగ్‌లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉండేది. టీ20 ప్రపంచకప్ 2022లో ఎంసీజీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ చేజ్ (25 బంతుల్లో 40 పరుగులు), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (19 బంతుల్లో 34 నాటౌట్ )లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు చెరో వికెట్ సాధించారు.
అనంతరం 196 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (97 నాటౌట్; 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. తిలక్ వర్మ (15 బంతుల్లో 27 పరుగులు ) రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ (18), హార్దిక్ పాండ్యా (17)లు పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అకేల్ హోసిన్ ఓ వికెట్ సాధించాడు.
