India A 348 runs all out in First Innings against England Lions
ఇంగ్లాండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికార టెస్టు మ్యాచ్‌లో భారత-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (116; 168 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగాడు. ధ్రువ్ జురెల్ (52; 87 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. కరుణ్ నాయర్ (40), నితీశ్ రెడ్డి (34) లు రాణించారు.
యశస్వి జైస్వాల్ (17), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11), శార్దూల్ ఠాకూర్ (19) లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ లయన్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్ మూడు వికెట్లు తీశాడు. జోష్ టంగ్, జార్జ్ హిల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఫర్హాన్ అహ్మద్, టామ్ హైన్స్ లు తలా ఓ వికెట్ సాధించారు.
29 పరుగులు 3 వికెట్లు..
7 వికెట్ల నష్టానికి 319 పరుగులో రెండో రోజు మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ భారత-ఏ మరో 29 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాటర్లు తనుష్ కొటియన్ (5), అన్షుల్ కాంబోజ్ (1) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు.
ఓవర్‌నైట్ స్కోరు మరో పది పరుగులు జోడించి తనుష్ కొటియన్ ఔట్ కాగా.. ఆ వెంటనే అన్షుల్ కాంబోజ్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. కాంబోజ్ తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో పరుగు మాత్రమే జోడించాడు. ఆఖరిలో తుషార్ దేశ్ పాండే (11), ఖలీల్ అహ్మద్ (7 నాటౌట్) కాస్త పోరాడంతో భారత్ 350 పరుగులకు చేరువగా వచ్చింది.