ఫస్ట్‌ ఫైట్‌ : భారత్‌-ఆసీస్‌ తొలి టెస్ట్‌మ్యాచ్‌.. టాప్ ఆర్డర్ ట్రబుల్స్

India vs Australia: 1st Test Match : ఆస్ట్రేలియాతో భారత్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఇవాళ (డిసెంబర్ 17) ఉదయం 9.30 గంటలకు జరుగనుంది. టీ20 సిరీస్ నెగ్గి జోష్ మీదున్న భారత జట్టు ఆసీస్ గడ్డపై మరోసారి సిరీస్ గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగబోతుంది. గతంలో ఆసీస్ గడ్డపై కంగారూలను కంగారెత్తించిన భారత్… ఈసారీ అదే మేజిక్ చేయాలని భావిస్తోంది. అయితే ఈసారి తమతో అంత ఈజీ కాదని నాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.

వన్డే సిరీస్‌ను ఆసీస్‌ నెగ్గితే.. టీ 20 సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. దీంతో టెస్ట్‌ సమరం ఆసక్తికరంగా మారింది. సొంతగడ్డ, నిప్పులు చెరిగే పేసర్లు, ఎలాంటి బౌలింగ్‌నైనా సమర్ధంగా ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్లతో ఆసీస్‌ చాలా బలంగా ఉంది. గులాబి బంతి అనుభవం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం…. బౌలింగ్‌లో బలంగానే కనిపిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌ భారత్‌ను భయపెడుతోంది. అయితే రెండో టెస్టు నుంచి తాను అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో ఎలాగైనా తొలిటెస్టును గెలవాలని కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు.

తొలి టెస్టులో శుభమన్‌గిల్‌కు చోటు గ్యారెంటీ అని భావించినప్పటికీ ఆశ్చర్యకరంగా పృధ్వీషాకు అవకాశం ఇచ్చింది. మయాంక్‌తో పాటు షా ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. అలాగే యంగ్‌ పంత్‌ను కాదని అనుభవం ఉన్న సాహాకే కోహ్లీ ఓటేశాడు. బుమ్రాతో పాటు ఉమేష్‌యాదవ్‌, మహ్మద్‌ షమి ఫాస్ట్‌ బౌలింగ్‌ బాధ్యతలు తీసుకుంటారు.

అశ్విన్‌ రూపంలో ఒకే ఒక్క స్పిన్నర్‌ను తీసుకున్నారు. కోహ్లీ నలుగురు బౌలర్ల వ్యూహం ఎంచుకోవడం ఆసక్తిని రేపుతోంది. గులాబి బంతితో ఆడటంలో ఆసీస్‌కు మంచి అనుభవం ఉంది. ఏడు పింక్ టెస్టులు ఆడితే అన్నింట్లోనూ వారిదే గెలుపు. అయితే భారత్ ఇప్పటిదాకా ఒక్కసారే గులాబి బంతితో ఆడింది. అదీ బంగ్లాదేశ్‌తో.. దీంతో ఆసీస్‌ను ఎలా ఎదుర్కుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గులాబి బంతి బాగా స్వింగ్ అవుతుంది. అయితే డే నైట్ మ్యాచ్ కావడంతో మధ్యాహ్నం ఎలాంటి స్వింగ్ దొరకదు.

కానీ సాయంత్రానికి మాత్రం తన ప్రతాపం చూపుతుంది. అలాగే బంతిని చూడటం బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందికరంగా మారుతుంది. ఇక రన్‌ మెషిన్‌ కోహ్లీని ఈ మ్యాచ్‌లో మూడు రికార్డులు ఊరిస్తున్నాయి.అడిలైడ్‌లో అత్యధిక పరుగులు చేసిన నాన్ ఆస్ట్రేలియన్‌గా ఘనత సాధించడానికి 180 పరుగుల దూరంలో ఉన్నాడు విరాట్. ఇది సాధిస్తే లారా రికార్డును బద్దలు కొడతాడు.

అలాగే ఆసీస్‌ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ రికార్డు బద్దలుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు కోహ్లీ. ఆసీస్‌లో సచిన్ ఆరు సెంచరీలు చేశాడు. కోహ్లీ ఒక్క వంద కొడితే సచిన్‌ను అధిగమిస్తాడు.

అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన వారి జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. వంద సెంచరీలతో సచిన్‌ మొదటి ప్లేస్‌లో ఉండగా… 71సెంచరీలతో రికీ పాంటింగ్‌ సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటికే 70శతకాలు బాదేశాడు. ఇంకోటి చేస్తే పాంటింగ్ సరసన చేరతాడు.