U-19 IND vs PAK : చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్‌పై భారత్ సంచలనం.. తొమ్మిదోసారి ఆసియా కప్ కైవసం!
U-19 IND vs PAK : అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. చివరి బంతికి మోహిత్ ఫోర్ కొట్టి భారత్‌కు తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ అందించాడు.
- Sreehari A
- Published on- November 14, 2026 / 06:58 PM IST
U-19 IND vs PAK
- ఓటమి అంచు నుంచి విజయతీరాలకు..
- చివరి బంతి వరకు ఉత్కంఠ..
- అండర్-19 ఆసియా కప్ భారత్‌దే
- ఒక్క ఫోర్‌తో చరిత్ర తిరగరాసిన మోహిత్
- తొమ్మిదోసారి ఛాంపియన్‌గా భారత్
U-19 IND vs PAK : క్రికెట్‌లో చివరి బంతి వరకు పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో భారత అండర్-19 జట్టు మరోసారి నిరూపించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన అండర్-19 వన్డే ఆసియా కప్ 2026 ఫైనల్లో యువ భారత్ అద్భుతం చేసింది.
చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉన్నా.. విజయానికి చివరి బంతి వరకు పోరాడి ఒక్క వికెట్ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. చివరి బంతికి 3 పరుగులు కావాల్సిన సమయంలో మోహిత్ ఉల్వా బౌండరీ బాది భారత శిబిరంలో ఆనందం నింపాడు. దీంతో భారత్ తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది.
పాక్ భారీ స్కోరు.. భారత్ భారీ లక్ష్యం ఛేధించి.. :
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ 107 పరుగులతో సెంచరీ నమోదు చేయగా, అబ్దుల్ ఖాదిర్ 80, కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 63 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కావ్య పటేల్ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. చిరుగుపాటి వెంకట 3 వికెట్లు పడగొట్టాడు.
లక్ష్య ఛేదనలో భారత్ పోరాటం :
338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్, కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ మంచి ఆరంభాన్ని అందించారు. ఆర్యవీర్ 58 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, లక్ష్య 80 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. అయితే, కీలక సమయంలో వరుస వికెట్లు పడటంతో భారత్ కష్టాల్లో పడింది. అన్వయ్ ద్రవిడ్ 19 పరుగులు చేయగా, మనల్ చౌహాన్ 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చివర్లో మోహిత్ మెరుపులు.. ఫైనల్ భారత్‌దే :
ఒకవైపు వికెట్లు పడుతున్నా మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా మాత్రం వెనక్కి తగ్గలేదు. తొమ్మిదో వికెట్‌కు విలువైన పరుగులు జోడించి భారత్‌లో విజయంపై ఆశలు రేపారు. చివరి ఓవర్‌లోనూ ఉత్కంఠ కొనసాగింది. ఆఖరి బంతికి 3 పరుగులు కావాల్సిన సమయంలో మోహిత్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయానికి కీలకంగా మారాడు.
గ్రూప్ దశలో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఫైనల్లో భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. ఈ విజయంతో యువ భారత ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠను పంచిన ఈ మ్యాచ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది..
