India vs South Africa 2nd T20 : దంచికొట్టిన రింకు సింగ్, సుర్యకుమార్ యాదవ్.. అయినా తప్పని ఓటమి

15 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. తొలి రెండు ఓవర్లలోనే 38 పరుగులు రాబట్టారు. మూడో ఓవర్లో జడేజా ..

IND vs SA 2nd T20 match

India vs South Africa Match: భారత్ జట్టుపై సఫారీ జట్టు విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 5వికెట్ల తేడాతో సఫారీ జట్టునే విజయం వరించింది. దీంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో సౌతాఫ్రికా జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరిదైన మూడో టీ20 మ్యాచ్ గురువారం జరుగుతుంది.

 

రింకూ సింగ్ కొట్టిన సిక్స్ కు స్టేడియంలోని మీడియా బాక్స్ అద్దం పగిలింది.

సౌతాఫ్రికా వేదికగా ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్ మంగళవారం రాత్రి జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ విధానంలో సఫారీల లక్ష్యాన్ని అంపైర్లు కుదించారు. 15 ఓవర్లకు 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లు ఆది నుంచి దూకుడుగా ఆడి 13.5 ఓవర్లలోనే 5వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు.

దంచికొట్టిన సూర్య, రింకు..
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యశస్వీ జైస్వాల్, శుభ్ మన్ గిల్ల్ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. అయితే, ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లు పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. తిలక్ వర్మ క్రీజులో ఉన్న కొద్దిసేపు బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. తిలక్ వర్మ ఔట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడారు. రింకూ సింగ్ తొలుత క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత వీరిద్దరూ పరుగుల వరద పారించారు. 125 పరుగుల వద్ద సూర్య ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ, జడేజా, అర్ష్ దీప్ కొద్దిసేపటికే పెవిలియన్ బాట పట్టారు. రింకుసింగ్ మాత్రం క్రీజులో ఉండి సిక్సర్ల వర్షం కురిపించాడు. రింకూ సింగ్ 39 బంతుల్లో 68 నాటౌట్ (9 ఫోర్లు, రెండు సిక్సులు) గా నిలిచాడు. ఆ తరువాత వర్షం రావడంతో భారత్ ఇన్నింగ్స్ 19.3 ఓవర్లకు ముగిసింది.

దుకుడుగా ఆడిన సౌతాఫ్రికా..
15 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. తొలి రెండు ఓవర్లలోనే 38 పరుగులు రాబట్టారు. మూడో ఓవర్లో జడేజా బ్రీజ్కెను ఔట్ చేశాడు. ఆ తరువాత హెండ్రిక్స్ తోపాటు మార్ క్రమ్ భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఎడాపెడా బౌండరీలు బాదారు. 96 పరుగుల వద్ద మార్క్ క్రమ్ ( 17 బంతుల్లో 30 పరుగులు) ఔట్ కావడం, ఆ వెంటనే 108 పరుగుల వద్ద హెండ్రిక్స్ (27 బంతుల్లో 49 పరుగులు) ఔట్ కావడం, వెంటనే హెన్రిచ్ క్లాసెన్ ఔట్ కావడంతో భారత్ విజయంపై ఆశలు చిగురించాయి. కానీ, మిల్లర్ కొద్దిసేపు దూకుడుగా ఆడటంతో భారత్ చేతిలో నుంచి మ్యాచ్ చేజారింది. 123 పరుగుల వద్ద మిల్లర్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత స్టబ్స్, ఫెలుక్వాయో 152 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. దీంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో సౌతాఫ్రికా జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.