బోణీ కొట్టేనా! : దక్షిణాఫ్రికా – భారత్ రెండో టీ 20 మ్యాచ్

  • Publish Date - September 18, 2019 / 03:17 AM IST

ఒక్క బాల్ పడకుండాన్ ఫస్ట్ మ్యాచ్ వర్షార్పణం అయింది. దీంతో.. పొట్టి ఫైట్‌లో మరో సమరానికి రెడీ అవుతున్నాయి భారత్ – దక్షిణాఫ్రికా. మరి మొహాలీ వేదికగా జరిగే టీ-20 మ్యాచ్‌లో టీమిండియా బోణీ కొడుతుందా… లేక సొంతగడ్డపై చతికిలపడుతుందా.. వరుణుడు మళ్లీ ఆడుకుంటాడా.. ఇవే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. 

మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది. ఒక్క బాల్ కూడా పడకుండానే వర్షం దంచికొట్టడంతో.. మ్యాచ్ రద్దైంది. దీంతో రెండో మ్యాచ్‌పై టీమిండియా దృష్టి పెట్టింది. సొంత గడ్డపై సత్తాచాటాలని టీమిండియా తహతహలాడుతోంది. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. దీంతో మిగతా రెండు మ్యాచ్‌లను ఎలాగైనా నెగ్గాలని టీమిండియా పట్టుదలతో ఉంది. 

వచ్చిన అవకాశాలను అంతగా సద్వినియోగం చేసుకోలేకపోతున్న పంత్‌పై అందరి చూపు పడింది. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ప్లేయర్లంగా ఉత్సాహంతో ఉండగా.. కొత్త కెప్టెన్ డి కాక్ సారథ్యంలో టఫ్ ఫైట్ ఇవ్వాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టీ 20 మ్యాచ్‌ల్లో భారత్‌కు పరాజయం ఎదురైంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ్టి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై బోణీ చేస్తుంది. 

జోరుమీదున్న టీమ్‌ ఇండియాను అడ్డుకోవడం డీ కాక్‌ సారథ్యంలోని దక్షిణాఫ్రికాకు కష్టమే. భారత బ్యాట్స్‌మెన్‌ను, ముఖ్యంగా రన్ మెషిన్ కోహ్లీని కట్టడి చేయడం సఫారీలకు కత్తిమీద సాములాంటిదే. శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండేలకు ఈ సిరీస్‌ చాలా ముఖ్యమైంది. మిడిల్‌ ఆర్డర్‌లో వాళ్లు సత్తా చాటాలని టీమ్ ఆశిస్తోంది. మరోవైపు వెస్టిండీస్‌లో విఫలమైన శిఖర్‌ ధావన్‌.. తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి ఈ సిరీస్‌ ఉపయోగపడే అవకాశం ఉంది. 

వెస్టిండీస్‌లో ఆడని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ప్రధాన పేసర్లు బుమ్రా, షమి, భువనేశ్వర్‌ల గైర్హాజరీలో సైని, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌ ఎలా రాణిస్తారో చూడాలి. టీ-20 వరల్డ్ కప్‌కు ఇంకా ఏడాది టైం ఉండటంతో ఈ మ్యాచ్ కుర్రాళ్ల సామర్థ్యానికి పరీక్షగా మారింది.