ప్రపంచ టెస్టు టోర్నీలో భారత్ తొలి మ్యాచ్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. వెస్టిండీస్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆడనున్న సిరీస్‌లో భాగంగా 2టెస్టులు ఆడనుంది టీమిండియా. మరి కొన్ని గంటల్లో అంటిగ్వా వేదికగా నార్త్‌ సౌండ్‌లో సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ జరగబోతోంది. విండీస్ పర్యటనలో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. టెస్టు సిరీస్‌కు ముందు వెస్టిండీస్ ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది భారత జట్టు. 

వెస్టిండీస్ జట్టులో సీనియర్లు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇదే అదనుగా కోహ్లీ సేన రెచ్చిపోతుంది. ఈ టెస్టు సిరీస్‌ను గెలిస్తే… వెస్టిండీస్‌లో 17 ఏళ్లుగా టెస్టు సిరీస్‌లలో విజయాలు అందుకుంటున్న జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించినట్లవుతుంది. వన్డే, టీ20లతో పోలిస్తే.. జట్టు కాస్త భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలర్లు ఇషాంత్ శర్మ, అశ్విన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మైదానంలోకి దిగనుండగా.. టీ20, వన్డేలకి దూరంగా ఉన్న బుమ్రా జట్టుతో చేరాడు. 

సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్‌లను చేజార్చుకున్న వెస్టిండీస్ జట్టు.. ఒత్తిడిలోనే టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగుతోంది. అయితే.. మునుపటితో పోలిస్తే ఆ జట్టు ఐదు రోజులు ఫార్మాట్‌లో నిలకడ సాధించింది. ఇటీవల తనకంటే బలమైన ఇంగ్లాండ్ టీమ్‌ని టెస్టు సిరీస్‌లో 2-1తో ఓడించడమే ఇందుకు నిదర్శనం. 

తక్కువ అంచనా వేస్తే.. 
సీనియర్ క్రికెటర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, ఛేజ్, కీమర్ రోచ్ జట్టులో ఉండగా.. కెప్టెన్ జాసన్ హోల్డర్ ఇటీవల ఆల్‌రౌండర్ ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. ఇంకా జట్టులో హెట్‌మేయర్, షై హోప్ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా.. రకీమ్‌ కార్న్‌వాల్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రకీమ్‌కు ఆల్‌రౌండర్‌గా దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. టీమిండియా రెండు సిరీస్‌ల విజయంతో కరేబియన్లను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం తప్పదు. 

జట్లు:
టీమిండియా :
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, అజింక్యా రహానే, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, రాహుల్‌, రిషబ్‌ పంత్‌, సాహా(వికెట్‌ కీపర్‌), హనుమ విహారి, జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేష్‌ యాదవ్‌.
వెస్టిండీస్‌ : హోల్డర్‌(కెప్టెన్‌), బ్రాత్‌వైట్‌, బ్రోక్స్‌, హెట్‌మెయిర్‌, డోవ్రిచ్‌, బ్రేవో, హోప్‌(వికెట్‌కీపర్‌), కార్న్‌వాల్‌, కీమో పాల్‌, క్యాంప్‌బెల్‌, గాబ్రియేల్‌, కీమర్‌ రోచ్‌, రోస్టన్‌ ఛేస్‌.