India vs West Indies 2nd Test: టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. సిరీస్ కైవసం

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న టీమిండియాకు వరుణుడు అడ్డు పడ్డాడు.. ఐదో రోజు భారీ వర్షం కురవడంతో ఒక్క బాల్ పడే అవకాశం లేకుండా పోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు.

India vs West Indies 2nd Test

India vs West Indies Test Series: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్న టీమిండియా జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. రెండో టెస్టు చివరి రోజు ఆట వర్షం కారణంగా రద్దయింది. కనీసం బాల్ వేసే అవకాశం లేకుండా భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ను డ్రా చేస్తూ అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 1-0తో సొంతం చేసుకుంది. రెండు టెస్టుల్లో భాగంగా మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 438 పరుగులు చేయగా, వెస్టిండీస్ జట్టు 255 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల ఆధిక్యంలోఉన్న టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి 181 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ (57), ఇషాన్ కిషన్ (52 నాటౌట్), యశస్వి జైస్వాల్ (38), శుభ్‌మన్ గిల్ (29 నాటౌట్) రాణించారు.

IND vs WI 2nd test : నిప్పులు చెరిగిన మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. వెస్టిండీస్ 255 ఆలౌట్‌.. భార‌త్‌కు భారీ ఆధిక్యం

రెండో టెస్టు నాలుగు రోజు (ఆదివారం) ఆటలో 365 పరుగుల లక్ష్యంతో వెస్టిండీస్ జట్టు బరిలోకి దిగింది. ఆదివారం పలుసార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో.. రెండు వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ జట్టు 76 పరుగులు చేసింది. విండీస్ జట్టు విజయం సాధించాలంటే 289 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. చివరి రోజు వెంటవెంటనే వికెట్లు పడగొట్టి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా సిద్ధమైంది. ఐదోరోజు (సోమవారం) ఆట ప్రారంభం నుంచి భారీ వర్షం కురిసింది. పలుసార్లు అంపైర్లు మ్యాచ్ ను నిర్వహించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ భారీ వర్షం కారణంగా మైదానంలో నీళ్లు నిలిచిపోవటంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ప్రకటిస్తూ అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ జట్టు 1-0 తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా గురువారం తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

 

టీమిండియా బౌలర్ సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ.. టెస్టుల్లో ఇది నా తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ఈ పిచ్‌పై పేసర్లకు పెద్దగా సాయం అందలేదు. అయినా, నేను నా ప్రణాళికను స్పష్టంగా అమలు చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో వికెట్లు తీస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని సిరాజ్ అన్నారు. కెప్టెన్ రోహత్ శర్మ నాపై ఎంతో నమ్మకం ఉంచారు. ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ఆడమని సూచించాడు. ఆ మేరకు స్వేచ్ఛ ఇచ్చాడు అని సిరాజ్ అన్నారు.

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్ షెడ్యూల్ ..

జూలై 27న తొలి వన్డే (కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్)
జూలై 29న రెండో వన్డే ( కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్)
ఆగస్టు 1న మూడో వన్డే (క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్)

ట్రెండింగ్ వార్తలు