IND VS PAK : కుల్దీప్ మాయ‌.. పాకిస్తాన్ పై 228 ప‌రుగుల భారీ తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం

టీమ్ఇండియా అద‌ర‌గొట్టింది. పాకిస్తాన్ పై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఆసియాక‌ప్ 2023లో భాగంగా సూప‌ర్-4 ద‌శ‌లో కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 228 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొంది.

Team India

India vs Pakistan : టీమ్ఇండియా అద‌ర‌గొట్టింది. పాకిస్తాన్ పై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఆసియాక‌ప్ 2023లో భాగంగా సూప‌ర్-4 ద‌శ‌లో కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 228 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొంది. 357 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 32 ఓవ‌ర్ల‌లో 128 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో ఫ‌కార్ జ‌మాన్ (27), ఆఘా స‌ల్మాన్ (23) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో పాక్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్లతో పాక్ ప‌త‌నాన్ని శాసించ‌గా, బుమ్రా, పాండ్య‌, శార్దూల్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 356 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (122 నాటౌట్‌; 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ (111 నాటౌట్; 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు సెంచ‌రీల‌తో దుమ్మురేపగా ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (56; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు) లు అర్థ‌శ‌త‌కాల‌తో స‌త్తా చాటారు.

South Africa : ప్ర‌పంచ‌క‌ప్ ముందు ద‌క్షిణాఫ్రికాకు భారీ షాక్‌..!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌కు తొలి వికెట్‌కు 121 ప‌రుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ఆరంభంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఆడిన ఈ జోడి త‌రువాత వేగం పెంచారు. గిల్ 37 బంతుల్లో, రోహిత్ శ‌ర్మ 42 బంతుల్లో అర్థ‌శ‌త‌కాలు పూర్తి చేసుకున్నారు. ప్ర‌మాద‌క‌రంగా మారిన ఈ జోడీని రోహిత్‌ను ఔట్ చేయ‌డం ద్వారా షాదాబ్ ఖాన్ విడ‌గొట్టాడు. అయితే.. ఆ మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనే షాహీన్ అఫ్రీది బౌలింగ్‌లో గిల్ కూడా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

రిజ‌ర్వ్ డేకు మ్యాచ్‌..

దీంతో భార‌త్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీతో కేఎల్ రాహుల్ జ‌త క‌లిశాడు. కాగా.. ఇన్నింగ్స్ 24.1 ఓవ‌ర్ల వ‌ద్ద భార‌త స్కోరు 147/2 ఉన్న ద‌శలో వ‌ర్షం మొద‌లుకావ‌డంతో మ్యాచ్‌ను నేటికి వాయిదా వేశారు. అప్ప‌టికి 17 ప‌రుగుల‌తో కేఎల్ రాహుల్, 8 ప‌రుగుల‌తో విరాట్ కోహ్లీలు క్రీజులో ఉన్నారు. ఈ రోజు మ్యాచ్ ఇక్క‌డి నుంచే మొద‌లైంది.

శ‌త‌కాల జోరు..

ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన రాహుల్‌-కోహ్లీ జోడి ఆ త‌రువాత జోరు పెంచారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్ర‌మంలో 60 బంతుల్లో రాహుల్‌, 55 బంతుల్లో కోహ్లీలు అర్థ‌శ‌త‌కాల‌ను పూర్తి చేశారు. ఆ త‌రువాత మ‌రింత ధాటిగా ఆడారు. పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ ఈ జోడీని విడ‌గొట్టేందుకు బౌల‌ర్ల‌ను మార్చి మార్చి ప్ర‌యోగించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది.

MS Dhoni: ఆటోగ్రాఫ్ ఇచ్చి చాక్లెట్ తీసుకున్న ధోనీ.. వీడియో వైరల్

మొద‌ట‌గా కేఎల్ రాహుల్ 100 బంతుల్లో, ఆ త‌రువాత విరాట్ కోహ్లీ 84 బంతుల్లో శ‌త‌కాల‌ను అందుకున్నారు. కేఎల్ రాహుల్‌కు వ‌న్డేల్లో ఇది ఆరో శ‌త‌కం కాగా విరాట్ కోహ్లీకి 47వ ది కావ‌డం విశేషం. వీరిద్ద‌రు అదే జోరును కొన‌సాగించ‌డంతో భార‌త్ భారీ స్కోరు చేసింది.

ట్రెండింగ్ వార్తలు