IND vs AUS 1st Test Match: తొలి ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన భారత్ బ్యాట్స్‌మెన్ .. ఆసీస్‌పై భారీ ఆధిక్యం ..

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ ఆసీస్ పై 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు.

IND vs AUS 1st Test Match

IND vs AUS 1st Test Match: ప్రతిష్ఠాత్మక బోర్డర్‌- గావాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా కొనసాగుతోంది. తొలిరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 177 పరుగుల వద్దే ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్ ధ్వయం ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను క్రీజ్‌లో కుదురుకోకుండా వెంటవెంటనే ఔట్ చేసింది. తొలిరోజే బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు కే.ఎల్. రాహుల్ వికెట్‌ను కోల్పోయి 77 పరుగు చేసింది. రెండో రోజు 77/1 పరుగులతో ఆటను ప్రారంభించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో విజృంభించాడు.

IND vs AUS 1st Test Match: టీమిండియా స్కోర్ 400.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం 223 పరుగులు

రోహిత్ 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఆ తరువాత వరుస వికెట్లు కోల్పోయిన భారత్‌ను జడేజా, అక్షర్ పటేల్ జోడీ ఆదుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇద్దరు ఆఫ్ సెంచరీలు చేశారు. దీంతో భారత్ స్కోర్ రెండో రోజు 321/7 వద్ద ముగిసింది. మూడో రోజు క్రీజ్‌లోకి వచ్చిన జడేజా, అక్షర్ పటేల్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే జడేజా (70) ఔట్ అయ్యాడు.

 

జడేజా ఔట్ కావటంతో క్రీజ్ లోకి వచ్చిన మహ్మద్ షమీ దూకుడుగా ఆడాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బౌండరీల మోత మోగించారు. దీంతో టీమిండియా స్కోర్ బోర్డు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. షమీ 47 బంతులు ఎదుర్కొని 37 వ్యక్తిగత స్కోర్ వద్ద మర్ఫీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇందులో రెండు ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి. ఆ తరువాత సిరాజ్ క్రీజ్ లోకి వచ్చాడు. అప్పటికే ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్న అక్షర్ పటేల్(84) ఔట్ అయ్యాడు. దీంతో కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అక్షర్ పటేల్ 174 బాల్స్ ఎదుర్కొని 84 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఇక ఆసీస్ బౌలర్లలో ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్ మర్పీ అద్బుత బౌలింగ్‌తో ఏడు వికెట్లు తీసుకున్నాడు. కమిన్స్ రెండు, లయన్స్ ఒక వికెట్ తీశారు. బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరుతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై భారత్ 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.