పంచుల వర్షం కురిపించిన మీనాక్షి, జైస్మిన్.. బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025లో భారత్‌కు 2 బంగారు పతకాలు..

ఈ విజయంతో జైస్మిన్, మీనాక్షి భారత ప్రపంచ ఛాంపియన్ల జాబితాలో చేరారు.

Minakshi Hooda, Jaismine Lamboria

World Boxing Championships 2025: జైస్మిన్ లాంబోరియా (57 కిలోల విభాగం), మీనాక్షి హూడా (48 కిలోల విభాగం) లివర్‌పూల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిళ్లు గెలిచారు. భారత బాక్సింగ్ చరిత్రలో స్థానం సంపాదించారు.

జైస్మిన్ 57 కిలోల విభాగం ఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, పోలాండ్‌కు చెందిన జూలియా సెరెమెటాను 4-1 తేడాతో, జడ్జీల స్కోర్‌కార్డుల్లో (30-27 29-28 30-27 28-29 29-28) ఓడించారు. అలాగే, మీనాక్షి ఆదివారం 48 కిలోల ఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, కజకస్థాన్‌కు చెందిన నాజిమ్ కైజైబాయ్‌ను 4-1 తేడాతో ఓడించి విజయం సాధించారు.

Also Read: అసోంలో 5.9 తీవ్రతతో భారీ భూకంపం.. జనాలు పరుగులు.. భూటాన్, మయన్మార్‌లోనూ..

ఈ విజయంతో జైస్మిన్, మీనాక్షి భారత ప్రపంచ ఛాంపియన్ల జాబితాలో చేరారు. అందులో ఆరు సార్లు గెలిచిన మేరీ కోమ్ (2002, 2005, 2006, 2008, 2010, 2018), రెండుసార్లు గెలిచిన నిఖత్ జరీన్ (2022, 2023), సరితా దేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్ (2006), లేఖా కెసీ (2006), నీతూ ఘంఘాస్ (2023), లోవ్లినా బోర్గోహైన్ (2023), సవీటి బూరా (2023) ఉన్నారు.

నూపుర్‌కు రజతం, పూజా రాణికి కాంస్యం

మరోవైపు, నూపుర్ శియోరన్ (80+ కిలోలు), పూజా రాణి (80 కిలోలు) రజత, కాంస్య పతకాలు సాధించారు. రెండో ఫైనల్లో నూపుర్ పోలాండ్‌కు చెందిన అగతా కజ్‌మార్స్కాతో పోరాడి 2-3 తేడాతో ఓడడంతో రజత పతకం దక్కింది. సెమీఫైనల్లో పూజా.. ఎమిలీ ఆస్క్విత్ చేతిలో 1-4 స్ప్లిట్ తో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.