ఐపీఎల్ 13వ సీజన్ 19వ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగళూరును చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదిరిపోయే ఆటతీరుతో వరుసగా మ్యాచ్‌ల్లో గెలుస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ ఇచ్చింది ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో బెంగళూరుపై ఢిల్లీ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది నాలుగో విజయం కాగా.. ఈ మ్యాచ్‌లో విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ., శిఖర్ ధావన్, పృథ్వీ షా అద్భుతమైన ఆరంభం ఇవ్వడంతో తొలి వికెట్‌కు 6.4 ఓవర్లలో 68 పరుగులు జోడించారు. షా 23 బంతుల్లో 42 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 182.61 స్ట్రైక్ రేట్‌తో ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో ధావన్ 28 బంతుల్లో మూడు ఫోర్లతో 32 పరుగులు చేశాడు.
దీని తరువాత, శ్రేయాస్ అయ్యర్ కేవలం 11 పరుగులు చేసి, దేవదత్ పాడికల్‌కు బౌండరీలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11.3 ఓవర్లలో 90 పరుగులకు మూడు వికెట్లు పడగా తర్వాత మార్కస్ స్టాయినిస్, రిషబ్ పంత్ ఢిల్లీ బౌలర్లపై దాడికి దిగారు.
పంత్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు సాయంతో 25 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అదే సమయంలో, మార్కస్ స్టోయినిస్ 26 బంతుల్లో 53 నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేటు 203.85గా ఉంది. తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లో స్టోయినిస్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. స్టోయినిస్ తన అర్ధ సెంచరీని కేవలం 24 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో ఇది అతని రెండవ హాఫ్ సెంచరీ.
అదే సమయంలో, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆర్‌సిబి తరఫున అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ నాలుగు ఓవర్లలో 34 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్.. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్.. మూడో ఓవర్ చివరి బంతికి మంచి ఫామ్‌లో ఉన్న దేవదత్ పాడికల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీని తరువాత, ఆరోన్ ఫించ్ కూడా అవుట్ అయ్యాడు. పవర్‌ప్లేలోనే దేవదత్ పడిక్కల్ (4), అరోన్ ఫించ్ (13), డివిలియర్స్ (9) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. కోహ్లీ కాసేపు వేగం కనబరిచాడు. అయితే రబాడ వేసిన 14వ ఓవర్లో విరాట్ వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో దాదాపుగా ఓటమి ఖాయమైంది.
తర్వాత వచ్చిన ఏ ఆటగాడు కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో బెంగళూరు ఓడిపోయింది.. రబాడ(4/24) ధాటికి బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్(2/18), నోర్ట్జే(2/22) చెరో రెండు వికెట్లు పడగొట్టారు.