IPL 2020, SRHvsDC: వార్నర్-సాహా హాఫ్ సెంచరీలు, ఢిల్లీకి భారీ టార్గెట్

IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ చెలరేగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి ఇన్నింగ్స్ ముగిసే వరకూ హిట్టింగ్ మీదనే ఫోకస్ పెట్టింది. ఆరెంజ్‌ ఆర్మీ ఎట్టకేలకు పరుగుల దాహం తీర్చుకున్నట్లుగా కనిపించింది. ఈ క్రమంలో ఢిల్లీకి 220 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

వార్నర్‌(66; 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు), వృద్ధిమాన్‌ సాహా(87; 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులు), మనీష్‌ పాండే(44 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సులు‌) చెలరేగి ఆడటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నార్జే, అశ్విన్‌లు తలో వికెట్‌ తీయగలిగారు.



టాస్‌ గెలిచిన ఢిల్లీ.. సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బెయిర్‌ స్టోను పక్కకు పెట్టిన సన్‌రైజర్స్‌.. విలియమ్సన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. దీంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను సాహా.. భాగస్వామ్యంతో వార్నర్‌ ప్రారంభించాడు. రబాడ వేసిన రెండో ఓవర్‌లోనే 15 పరుగులు సాధించి శుభారంభాన్ని నమోదుచేసింది. ఆ తర్వాత అదే దూకుడుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది రైజర్స్.

34 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సులతో 66 పరుగులు సాధించిన వార్నర్‌ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌ వేసిన 10వ ఓవర్‌ నాల్గో బంతికి వార్నర్‌ పెవిలియన్‌ చేరాడు. 10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టానికి 113 పరుగులు చేసింది. ఇదే ఊపులో సాహా కూడా హాఫ్‌ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. 27 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. వార్నర్‌-సాహాల జోడి తొలి వికెట్‌కు 107 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేసింది.

వార్నర్ మెరుపులు:

కచ్చితంగా గెలిస్తేనే ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండే క్రమంలో వార్నర్‌ తడాఖా చూపించాడు. 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ.. రబాడ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో వార్నర్‌ చెలరేగిపోయాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 పరుగులు నమోదు చేశాడు. పవర్‌ ప్లే ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేసింది.