IPL playoffs race
IPL playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 లీగ్ దశ దాదాపు ముగింపుకు వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మినహా ప్లే ఆఫ్స్ చేరే మిగిలిన జట్లు ఏవో ఇంకా తేలలేదు. 18 పాయింట్లతో ఉన్న గుజరాత్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో ఓడినప్పటికి కూడా గ్రూప్ టాపర్‌గానే కొనసాగనుంది గుజరాత్. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం మాత్రం హోరాహోరీ పోరు కనిపిస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మిగిలిన వాటిలో ఏ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయన్నది చెప్పడం కష్టంగా మారింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించడం ప్లే ఆఫ్స్ రేసును మరింత రసవత్తరంగా మార్చింది. ఏ జట్లకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఓ సారి చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) : 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది ధోని సేన. మరో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రెండో స్థానంలోనే ప్లే ఆఫ్స్‌కు చేరుకోనుంది. ఒక వేళ ఢిల్లీతో సీఎస్‌కే ఓడిపోయి అదే సమయంలో తమ చివరి మ్యాచుల్లో లక్నో, ముంబై, బెంగళూరు గెలిస్తే మాత్రం చెన్నై అవకాశాలకు ప్రమాదం తప్పదు.
లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) : 15 పాయింట్లు ఉన్నప్పటికి రన్‌రేట్‌లో స్వల్ప తేడా కారణంగా లక్నో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్‌ను కోల్‌కతాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు ఈజీగా వెలుతుంది. ఓడితే మాత్రం మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ముంబై ఇండియన్స్(Mumbai Indians): లక్నోతో మ్యాచ్‌లో ఓడిపోయి తన ప్లే ఆఫ్స్ అవకాశాలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరి. అప్పడు ముంబై పాయింట్లు 16కు చేరుకుంటాయి. ఇక అదే సమయంలో ఆర్‌సీబీ, పంజాబ్‌లు కూడా మిగిలిన మ్యాచుల్లో విజయం సాధిస్తే ఆ జట్ల పాయింట్లు కూడా 16 కు చేరుకుంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. కాబట్టి హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై భారీ తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) : 12 మ్యాచులు ఆడిన బెంగళూరు 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ పై భారీ విజయం సాధించడం ఆర్‌సీబీకి కలిసి వచ్చింది. నెట్‌రన్ ప్లస్‌లో ఉంది. సన్‌రైజర్స్, గుజరాత్‌తో మ్యాచుల్లో విజయం సాధిస్తే మాత్రం మిగిలిన జట్లతో పోలిస్తే బెంగళూరుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
పంజాబ్ కింగ్స్ ((Punjab Kings): 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడం సానుకూలంశం కాగా.. నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉండడం ప్రతికూలాంశం. ఢిల్లీ, రాజస్థాన్‌లపై భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. నేడు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో ఓడితే ఇక ఆశలు వదులుకోవాల్సిందే.
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals): బెంగళూరు పై ఓడిపోవడం రాజస్థాన్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. నెట్‌రన్‌రేట్ ప్లస్‌లో ఉండడం ఒక్కటే రాజస్థాన్‌కు కాస్త ఊరట నిచ్చే అంశం. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించాలి. అదే సమయంలో బెంగళూరు, ముంబైలు తమ తరువాతి మ్యాచుల్లో ఓడిపోవాలి.
కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders): 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది కోల్‌కతా. నెట్ రన్‌రేట్ మైనస్‌లో ఉంది. ఆఖరి మ్యాచ్‌లో ఎంత భారీ తేడాతో విజయం సాధించినా ప్లే ఆఫ్స్‌కు చేరడం చాలా కష్టం. అద్భుతం జరిగితే తప్ప.