Axar Patel : అందుకనే నేను బౌలింగ్ చేయలేదు.. మంచే జరిగింది.. అక్షర్ పటేల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..
పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించడం పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 12, 2026 / 09:34 AM IST
IPL 2026 Axar Patel key comments after Delhi Capitals beat Punjab Kings (pic credit@ipl)
- చావో రేవో మ్యాచ్‌లో పంజాబ్ పై విజయం
- ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కామెంట్స్
- మాది మంచి జట్టు, మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం అని వ్యాఖ్య
Axar Patel : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చావో రేవో మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మూడు వికెట్లు తేడాతో గెలుపొందింది. ఈ విజయం పై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాము ఓ మంచి జట్టు అని నిరూపించుకున్నామని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (56; 33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (59; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీలు చెరో రెండు, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టాడు.
Rahul Dravid : టీ20 లీగ్‌లో జట్టును కొన్న రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్..
ఆ తరువాత అక్షర్ పటేల్ (56; 30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (51; 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించడంతో 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యశ్ ఠాకూర్‌లు చెరో రెండు వికెట్లు, స్టోయినిస్, బెన్ డ్వార్షుయిస్ లు తలా ఓ వికెట్ సాధించారు.
మాది మంచి జట్టు
ఈ మ్యాచ్ అనంతరం తమ జట్టు విజయం సాధించడం పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో తాము కీలక సమయాల్లో విఫలం అవుతున్నామని, అందుకనే ఆయా ఆయా మ్యాచ్‌లను కోల్పోయామన్నాడు. అయినప్పటికి కూడా తమది చాలా మంచి జట్టు అని, తాము మంచి క్రికెట్ ఆడుతున్నట్లుగానే చెప్పుకొచ్చాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా క్లిష్ట పరిస్థితుల్లో పుంజుకోవడం చాలా బాగుందన్నాడు.
తొలి మూడు ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చినప్పటికి కూడా ఆ తరువాత పుంజుకున్న తీరు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్ అద్భుతంగా బంతులు వేశారన్నాడు. ఇక యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడం జట్టు భవిష్యత్తుకు మంచిది అని అన్నాడు.
ఇక ఛేజింగ్‌లో డేవిడ్ మిల్లర్‌తో తాను నిర్మించిన భాగస్వామ్యం మ్యాచ్ గమనాన్ని మార్చి వేసిందన్నాడు. అశుతోష్ శర్మ, మాధవ్ లు మ్యాచ్‌ను అద్భుతంగా ముగించారన్నాడు. ఇక ఈ పిచ్ నుంచి పేసర్లకు లభిస్తున్న సహకారం చూసిన తరువాత తాను బౌలింగ్ వేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా అంతా మంచే జరిగిందన్నాడు.
