Shreyas Iyer fined : చెన్నైపై విజయం.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. ఇంకోసారి ఇలాగే జరిగితే..
వరుస విజయాలతో జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో (Shreyas Iyer fined )పాటు జట్టు సభ్యులకు జరిమానా విధించింది.
- Thota Vamshi Kumar
- Published On : April 4, 2026 / 07:49 AM IST
IPL 2026 CSK vs PBKS Shreyas Iyer has been penalised 24 Lakhs for maintaining slow overrate (pic credit@ipl)
- చెన్నైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటును నమోదు చేసిన పంజాబ్
- ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు ఇలా చేయడం రెండోసారి
- శ్రేయస్ అయ్యర్‌తో పాటు జట్టు సభ్యులకు భారీ జరిమానా
Shreyas Iyer fined : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి అగ్రస్థానంలోకి దూసుకువెళ్లింది.
కాగా.. వరుస విజయాలతో జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు జట్టు సభ్యులకు జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడమే (స్లో ఓవర్ రేటు) అందుకు కారణం.
Ruturaj Gaikwad : మేం ఓడిపోయింది అందుకే.. మా బౌలర్లు ఉన్నారే.. రుతురాజ్ గైక్వాడ్ కామెంట్స్..
కాగా.. పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేయడం ఈ సీజన్‌లో ఇది రెండో సారి. మొదటి సారి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు 12లక్షల జరిమానా విధించారు. రెండో సారి కూడా పునరావృతం కావడంతో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్‌కు 24లక్షల జరిమానా విధించారు. అంతేకాదండోయ్ ఇంపాక్ట్ ప్లేయర్ తో సహా తుది జట్టులోని ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం రెండింటిలో ఏది తక్కువైతే అది జరిమానా విధించారు.
‘చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026లోని 7వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు స్లో ఓవర్-రేట్‌ను కొనసాగించినందుకు ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు జరిమానా విధించాం. కనీస ఓవర్-రేట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన రెండవ ఉల్లంఘన ఇది. దీంతో అయ్యర్‌కు 24 లక్షల రూపాయల జరిమానా విధించాం. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగిలిన సభ్యులకు ఆరు లక్షల రూపాయలు లేదా వారి వారి మ్యాచ్ ఫీజులలో 25 శాతం, ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది జరిమానాగా విధించబడింది.’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది.
మ్యాచ్ నిషేదం..
ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు మూడోసారి కూడా స్లో ఓవర్ రేటును నమోదు చేస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అప్పుడు కెప్టెన్ కు 30లక్షల జరిమానా విధించబడుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ఆటగాళ్లకు తలా 12 లక్షలు లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం రెండింటిలో ఏది తక్కువ అయితే అది జరిమానా విధించబడుతుంది. అంతేకాదండోయ్ కెప్టెన్ ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఆయుష్ మాత్రే (43 బంతుల్లో 73 పరుగులు), శివమ్ దూబె (27 బంతుల్లో 45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (12 బంతుల్లో 32 పరుగులు) రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ వైశాఖ్ రెండు, జేవియర్ బార్ట్‌లెట్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం శ్రేయాస్ అయ్యర్ (29 బంతుల్లో 50 పరుగులు) అర్థశతకం చేయగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 43 పరుగులు), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39 పరుగులు) రాణించడంతో 210 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బౌలర్లలో మాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
