Ruturaj Gaikwad : మేం ఓడిపోయింది అందుకే.. మా బౌలర్లు ఉన్నారే.. రుతురాజ్ గైక్వాడ్ కామెంట్స్..
బౌలర్ల వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్‌లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) తెలిపాడు
IPL 2026 CSK vs PBKS Ruturaj Gaikwad comments after Chennai Super Kings lost match to Punjab Kings (pic credit@ipl)
- వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన చెన్నై
- బౌలర్ల వైఫల్యం వల్లే ఓడిపోయాం అన్న రుతురాజ్ గైక్వాడ్
- బ్యాటింగ్ విభాగంపై సంతృప్తి
Ruturaj Gaikwad : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓడిపోయింది. శుక్రవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. బౌలర్ల వైఫల్యం కారణంగానే తాము ఈ మ్యాచ్‌లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఆయుష్ మాత్రే (73; 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. శివమ్ దూబె (45 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (32; 12 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టాడు. జేవియర్ బార్ట్లెట్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 210 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (50; 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్ష్ ఆర్య (39; 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు)లు రాణించారు. చెన్నై బౌలర్లలో మాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
209 అనేది చాలా మంచి స్కోర్
ఈ మ్యాచ్‌లో ఓటమి తనను నిరాశ పరిచిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. నిజం చెప్పాలంటే 209 అనేది చాలా మంచి స్కోరు అని చెప్పుకొచ్చాడు. పిచ్ నుంచి పేసర్లకు సహకారం అందిందన్నాడు. స్లో బాల్స్ గ్రిప్ అవుతున్నాయని, పెద్ద బౌండరీలు ఉండడంతో ఇది చాలా మంచి స్కోరు అనిపించిందన్నాడు.
రాహుల్‌ను ఇంపాక్ట్ సబ్‌గా తీసుకోవడంపై మాట్లాడుతూ.. తాము ముగ్గురు సీమర్లు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లతో ఆడాలని అనుకున్నాము. ఈ కాంబినేషన్ జట్టుకు ఉపయోగపడుతుందని అనుకున్నామన్నాడు. అయితే.. స్పిన్నర్లకు ఈ రోజు అసలు కలిసిరాలేదు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయామన్నాడు. వికెట్లు తీయకపోవడం కూడా తమను దెబ్బతీసిందన్నాడు.
‘ఇది చాలా కఠినమైన మ్యాచ్. అయినప్పటికి కూడా ఈ మ్యాచ్ నుంచి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. మా బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ముఖ్యంగా ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే శివమ్ దూబే కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా బ్యాటింగ్ విభాగం బాగా ఆడింది. మా బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉంది.’ అని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.
తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘జట్టుకు ఏది అవసరమో, ఆ పాత్రకు అనుగుణంగా మారడమే ముఖ్యం. ఈరోజు వికెట్ కొంచెం గ్రిప్ అవుతున్నందున, బహుశా మరికొంత సేపు క్రీజులో నిలదొక్కుకోవాలని నాకు అనిపించింది. ఆ తరువాత వేగంగా ఆడాలని అనుకున్నాను. అయితే.. దురదృష్టవశాత్తు తప్పుడు సమయంలో ఔట్ అయ్యాను.’ అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
