MI vs CSK : ఓట‌మికి సాకులు చెప్ప‌డం లేదు.. నిజంగా మా కొంప‌ముంచింది అదే.. హార్దిక్ పాండ్యా కామెంట్స్‌..

గురువారం వాంఖ‌డే వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్(MI vs CSK ) 103 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది.

IPL 2026 Hardik Pandya comments after Mumbai Indians lost match to Chennai Super Kings (pic credit@ipl)

  • వాంఖ‌డేలో సీఎస్‌కే ఓట‌మి
  • ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీల‌క వ్యాఖ్య‌లు
  • సీఎస్‌కే ఆడిన పిచ్ పైనే మేం ఆడాము
  • పిచ్‌లో ఎలాంటి మార్పు లేదు

MI vs CSK : ఐదు సార్లు ఛాంపియ‌న్‌ అయిన ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఐదో ఓట‌మిని చ‌విచూసింది. గురువారం వాంఖ‌డే వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 103 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. ప‌వ‌ర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవ‌డ‌మే త‌మ కొంప‌ముంచింద‌ని ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

సంజూ శాంస‌న్ (101; 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) సూప‌ర్ సెంచ‌రీతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రెవిస్ (21)లు రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో ఘజన్‌ఫర్, అశ్వని కుమార్ లు చెరో రెండు వికెట్లు తీశారు. జ‌స్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్న‌ర్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

అనంత‌రం 208 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్ 19 ఓవ‌ర్ల‌లో 104 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ (37; 29 బంతుల్లో 5 ఫోర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్ (36; 30 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో అకేల్ హోసేన్ నాలుగు వికెట్లు తీశాడు. నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ముకేశ్ చౌద‌రి, అన్షుల్ కాంబోజ్, జామీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఓట‌మికి సాకులు చెప్ప‌ను

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ల‌క్ష్యాన్ని ఛేదించాలంటే మెరుగైన ఆరంభం ల‌భించాల‌ని, కానీ ప‌వ‌ర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవ‌డంతో తాము కోలుకోలేక‌పోయామ‌న్నాడు. ఇక ఓట‌మికి తాము ఎలాంటి సాకులు చెప్ప‌డం లేద‌న్నాడు. ముఖ్యంగా పిచ్ పై నింద‌లు వేయ‌మ‌న్నాడు. తాము బ్యాటింగ్ చేసేట‌ప్పుడు పిచ్ లో పెద్ద‌గా మార్పు లేద‌న్నాడు. ఇదే పిచ్ పై చెన్నై బ్యాట‌ర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 207 ప‌రుగులు చేశారన్నాడు.

Krunal Pandya : హార్దిక్ పాండ్యాతో గొడ‌వ‌లు.. స్పందించిన కృనాల్ పాండ్యా.. నేను అస‌లు..

సీఎస్‌కే స్పిన్న‌ర్లు బంతిని బాగా ట‌ర్న్ చేయ‌డం పై మాట్లాడుతూ.. చెన్నై స్పిన్న‌ర్లు మాత్ర‌మే కాద‌ని ముంబై స్పిన్న‌ర్లు కూడా చాలా బాగా బౌలింగ్‌ చేశార‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. సంజూ శాంస‌న్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడార‌ని కొనియాడాడు. సీఎస్‌కే బ్యాట‌ర్లు ఇలా వ‌చ్చి అలా వెళ్లిన‌ప్ప‌టికి కూడా స్కోరు బోర్డును ముందుకు న‌డిపించార‌న్నాడు.

ఈ పిచ్ పై అది ఛేదించే ల‌క్ష్య‌మేన‌ని హార్దిక్ చెప్పుకొచ్చాడు. అయితే.. ప‌వ‌ర్ ప్లేలో త‌మ‌కు కావాల్సిన మూమెంట‌మ్ ల‌భించ‌లేద‌న్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో తుది జ‌ట్టులో భారీ మార్పులు ఉంటాయా? అనే ప్ర‌శ్న ఎదురుకాగా.. మ్యాచ్‌లో విజ‌యం సాధించేందుకు ఏం చేయాల‌నే దానిపైన చ‌ర్చించుకుంటామ‌న్నాడు. జ‌ట్టుకు ఏది మంచిది అయితే దాన్నే చేస్తామ‌న్నాడు. త‌దుప‌రి మ్యాచ్‌కు కొంత స‌మ‌యం ఉంద‌ని, ఈ విరామంలో తాము చేసిన త‌ప్పిదాల‌పై దృష్టి సారించి స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నాడు.