Hardik Pandya : అస‌లే ఓట‌మి బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు మ‌రో షాక్‌.. మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానా.. చేసుకున్న దానికి చేసుకున్నంత‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya)ఐపీఎల్ నిర్వాహ‌కులు మ‌రో షాక్ ఇచ్చారు.

IPL 2026 KKR vs MI Hardik Pandya has been fined 10 percent of his match fee (pic credit@ipl)

  • కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై
  • హార్దిక్ పాండ్యాకు భారీ షాక్‌
  • మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత‌, అత‌డి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జ‌మ‌

Hardik Pandya : ఐపీఎల్ 2026లో భాగంగా బుధ‌వారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజ‌న్‌లో ముంబైకి ఇది 9వ ఓటమి కావ‌డం గ‌మ‌నార్హం. అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ నిర్వాహ‌కులు మ‌రో షాక్ ఇచ్చారు. అత‌డి మ్యాచ్ ఫీజులో 10 జ‌రిమానాగా విధించారు. అంతేకాదండోయ్ అత‌డి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చారు. ఇక చేసిన త‌ప్పును, విధించిన శిక్ష‌ను హార్దిక్ పాండ్యా అంగీక‌రించాడ‌ని, దీనిపై ఎలాంటి త‌దుప‌రి విచార‌ణ ఉండ‌ద‌ని ఐపీఎల్ నిర్వాహ‌కులు తెలిపారు.

మ్యాచ్ సంద‌ర్భంగా ఆట‌గాళ్లు, జ‌ట్టు అధికారు కోసం ఉద్దేశించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ పాండ్యాకు ఈ జ‌రిమానా విధించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ 10 ఓవ‌ర్‌లో పాండ్యా లెవ‌ల్ 1 ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన‌ట్లు ఐపీఎల్ నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అత‌డు బౌలింగ్ చేసేందుకు వెళ్లే క్ర‌మంలో బెయిల్స్‌ను ప‌డ‌గొట్టాడు.

Rohit Sharma : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 నుంచి రోహిత్ శ‌ర్మ ఔట్‌? హిట్‌మ్యాన్ భ‌విత‌వ్యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న బీసీసీఐ!

అస‌లేం జ‌రిగిందంటే?

కేకేఆర్ ఇన్నింగ్స్ 10 ఓవ‌ర్‌ను హార్దిక్ పాండ్యా వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి దీప‌క్ చాహ‌ర్, రాబిన్ మింజ్‌లు బంతి ప‌ట్టుకోకుండా ఈజీ క్యాచ్‌ను మిస్ చేశారు. ఆ త‌రువాతి రెండు బంతులకు మ‌నీశ్ పాండే రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో పాండ్యా తీవ్ర నిరాశ చెందాడు. ఓ వైపు ఫీల్డ‌ర్లు క్యాచ్‌లు మిస్ చేయ‌డం, మ‌రో వైపు వ‌రుస బౌండ‌రీలు ఇవ్వ‌డంతో తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తూ.. తిరిగి బౌలింగ్ వేసేందుకు వెలుతూ.. నాన్ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న వికెట్ల‌ను చేతితో కింద ప‌డేశాడు.

‘బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన 65వ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు, జట్టు అధికారుల కోసం ఉద్దేశించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1ను ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అతని మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించారు. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదా ఫిక్స్చర్‌లు, ఫిట్టింగులను దుర్వినియోగం చేయడంకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను హార్దిక్ పాండ్యా ఉల్లంఘించినట్లు తేలింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోని 10వ ఓవర్‌లో 4వ బంతికి ఈ సంఘటన జరిగింది. హార్దిక్ పాండ్యా తన రన్-అప్‌కు తిరిగి వెళ్తుండగా, వికెట్‌లోని బెయిల్స్‌ను బలంగా పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ విధించిన శిక్షను స్వీకరించాడు.’ అని ఐపీఎల్ నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.