mumbai indians : MI ఖేల్ ఖతం కాలే.. ఇంకా ప్లే ఆఫ్స్ రేస్‌లో ఉంది.. ఇదిగో క్లియర్ ఈక్వేషన్..
IPL 2026 : ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. వీటిలో కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది.
- Harish Thanniru
- Updated on- May 3, 2026 / 11:29 AM IST
mumbai indians
- సీఎస్‌కే జట్టుపై ముంబై ఇండియన్స్ ఓటమి
- ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ముంబై
- వచ్చే ఐదు మ్యాచ్‌లు గెలవాల్సిందే
- ఐదు మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్స్ అవకాశాలు కష్టమే
mumbai indians : ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలైంది. తద్వారా ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అవకాశాలు ఉన్నాయి.. కానీ, గణాంకాల ప్రకారం.. మిగిలిన జట్ల ఆటతీరుపైనా ముంబై జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. వీటిలో కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో అంటే తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంకా ఐదు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.
ప్రస్తుతం గణాంకాల ప్రకారం.. ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే వచ్చే ఐదు మ్యాచ్ లలో విజయం సాధించాల్సి ఉంటేంది. అలా జరిగితే ఆ జట్టు 14 పాయింట్లకు చేరుకోగలుగుతుంది. అయినప్పటికీ ప్లేఆఫ్స్ చేరుతుందని గ్యారంటీ లేదు. ఇతర జట్ల ఆటతీరు.. ఆయా జట్లకు వచ్చిన పాయింట్లు, రన్ రేట్ మీద ముంబై ప్లేఆఫ్స్ వెళ్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. గణాంకాల ప్రకారం.. ముంబై జట్టు ప్లేఆఫ్స్ కు చేరేందుకు అవకాశాలు ఉన్నాయి.. కానీ, చాలా కష్టం అని చెప్పొచ్చు.
ముంబై జట్టు మే 10న డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ , మే 14న ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడాల్సి ఉంది. ఈ రెండు జట్లపై విజయం సాధించడం అంతతేలికైన విషయం కాదు. లీగ్ లో మంచి ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టునుసైతం ఎదుర్కోవాల్సి ఉంది. ప్రస్తుతం ముంబై జట్టు ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే రాబోయే ఐదు మ్యాచ్ లలో విజయం సాధించడం కష్టమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఈ సీజన్ మాది కాదనిపిస్తుందని తమ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు.
