Pat Cummins : తృటిలో చేజారిన క్వాలిఫ‌య‌ర్‌-1 బెర్తు.. పాట్ క‌మిన్స్ కీల‌క కామెంట్స్‌.. ఇంకో 5 రోజులు..

ఆర్‌సీబీ పై విజ‌యం సాధించిన త‌రువాత స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ (Pat Cummins) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

IPL 2026 Pat Cummins key comments after SRH vs RCB match (pic credit@ipl)

  • ఆర్‌సీబీ పై స‌న్‌రైజ‌ర్స్ భారీ విజ‌యం
  • అయినా గానీ క్వాలిఫ‌య‌ర్‌-1లో ద‌క్క‌ని చోటు

Pat Cummins : శుక్ర‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు 55 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. అయిన‌ప్ప‌టికి కూడా స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు తృటిలో క్వాలిఫ‌య‌ర్‌-1 బెర్తును చేజార్చుకుంది. టాప్‌-2 స్థానం కోసం త‌మ శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నించామ‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ తెలిపాడు. బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించిన‌ప్ప‌టికి కూడా బెంగ‌ళూరును 166 ప‌రుగుల‌కు క‌ట్ట‌డి చేసి ఉంటే ఎస్ఆర్‌హెచ్ క్వాలిఫ‌య‌ర్‌-1 బెర్తును ద‌క్కించుకునేది.

ఇషాన్ కిష‌న్ (79; 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అభిషేక్ శ‌ర్మ (56; 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), హెన్రిచ్ క్లాసెన్ (51; 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు)లు హాఫ్ సెంచ‌రీలు బాద‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 255 ప‌రుగులు సాధించింది. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో రసిఖ్ సలాం దార్ రెండు వికెట్లు తీశారు. సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యాలు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం 256 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులకు ప‌రిమిత‌మైంది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో ర‌జ‌త్ పాటిదార్ (56; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. వెంక‌టేశ్ అయ్య‌ర్ (44; 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) , కృనాల్ పాండ్యా (41 నాటౌట్; 31 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ రెండు వికెట్లు తీశాడు. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

మ్యాచ్ అనంత‌రం పాట్ క‌మిన్స్ మాట్లాడుతూ.. టాప్‌-2లో నిలిచేందుకు త‌మ శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నించామ‌ని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించ‌డం ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. బ్యాట‌ర్లు అద్భుతంగా ఆడార‌ని కితాబు ఇచ్చాడు. ఇక బౌల‌ర్లు కూడా బాగా బౌలింగ్ చేశార‌ని, మొత్తానికి అంద‌రూ మంచి ఫామ్‌లో ఉన్నార‌న్నారు. ఉప్ప‌ల్ పిచ్ చాలా మంచి వికెట్ అని తెలిపాడు.

PAK vs AUS : ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌కు పాక్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. బాబ‌ర్ ఆజామ్‌కు చోటు..

పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-2లో నిల‌వాలంటే చాలా స‌మీక‌ర‌ణాలు క‌లిసి రావాల్సి ఉంటుంద‌నే విష‌యం త‌మ‌కు కూడా తెలుసున‌ని అన్నాడు. చాలా పోరాడామ‌ని, ఇక ఆర్‌సీబీ కూడా త‌మ నెట్ ర‌న్‌రేటు ప‌డిపోకుండా జాగ్ర‌త్త‌గా ఆడింద‌ని దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింద‌న్నాడు. ఏదీఏమైన‌ప్ప‌టికి కూడా ఇది త‌మ‌కు అతి పెద్ద విజ‌యం అని తెలిపాడు.

బౌలింగ్ విభాగంపై ప్ర‌శంస‌లు కురిపించాడు. బౌల‌ర్లు అద్భుతంగా రాణిస్తున్నార‌ని, వారి నుంచి తాను కూడా చాలా విష‌యాల‌ను నేర్చుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ప‌వ‌ర్ ప్లేలో ఇషాన్ మ‌లింగ్ త‌న స్లో బాల్స్‌తో, బౌలింగ్‌లో వేరియేష‌న్స్ చూపిస్తూ ఈ సీజ‌న్ అంత‌టా బౌలింగ్ చేస్తున్న తీరు బాగుంద‌న్నాడు. ఇక సాకీబ్ హుస్సేన్ కూడా రాణిస్తున్నాడ‌ని తెలిపాడు. ఇలాంటి బౌల‌ర్లు ఉండ‌డం కెప్టెన్‌గా త‌న అదృష్టం అని చెప్పుకొచ్చాడు.

ఎలిమినేట‌ర్ మ్యాచ్ గురించి..

18 పాయింట్ల‌తో ఆర్‌సీబీ, గుజ‌రాత్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు స‌మానంగా నిలిచిన‌ప్ప‌టికి కూడా నెట్‌ర‌న్‌రేటు త‌క్కువ‌గా ఉండ‌డంతో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానానికి ప‌రిమిత‌మైంది. ఈ క్ర‌మంలో నాలుగో స్థానంలో నిలిచే జ‌ట్టుతో ఈ నెల 27న ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. న్యూ చండీగ‌ఢ్‌లో జ‌ర‌గ‌నున్న త‌దుప‌రి మ్యాచ్ కు ఇంకో 5 నుంచి 6 రోజుల స‌మ‌యం ఉంద‌న్నాడు. కాబ‌ట్టి హైద‌రాబాద్‌లోనే రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆ త‌రువాత అక్క‌డికి వెళ‌తామ‌న్నాడు. త‌మ కుర్రాళ్ల‌కు ఆ మైదానం గురించా బాగా తెలుసున‌ని అన్నాడు. ఒక‌టి లేదా రెండు రోజుల్లో తాము ఎవ‌రితో త‌మ‌ప‌డ‌నున్నామ‌నే విష‌యం తెలుస్తుంద‌ని, ఆ త‌రువాత ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తామ‌ని తెలిపాడు.