ipl 2026 playoffs scenario : 11 మ్యాచ్‌లు 14 పాయింట్లు.. ఆర్‌సీబీ, సన్‌రైజర్స్, గుజరాత్.. మధ్యలో పంజాబ్, సీఎస్‌కే, రాజస్థాన్‌లు ఏం చేస్తాయో..
ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు ( ipl 2026 playoffs scenario) రసవత్తరంగా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- May 11, 2026 / 08:26 AM IST
ipl 2026 playoffs scenario 4 spots major 7 teams fight
- రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు
- ప్రస్తుతానికి టాప్-3లో నిలిచిన ఆర్‌సీబీ, సన్‌రైజర్స్, గుజరాత్
- తలా 14 పాయింట్లతో..
ipl 2026 playoffs scenario : ఐపీఎల్ 2026 సీజన్‌లో లీగ్ దశ ముగింపుకు చేరుకుంది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టలేదు. ఆర్‌సీబీ, సన్‌రైజర్స్, గుజరాత్ జట్లు ఇప్పటి వరకు తలా 11 మ్యాచ్‌లు ఆడాయి. ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. ఈ మూడు జట్ల ఖాతాల్లోనూ 14 పాయింట్లే ఉన్నాయి. అయితే.. నెట్‌రన్‌రేటు మెరుగ్గా ఉన్న ఆర్‌సీబీ (+1.103) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (+0.737) ఉండగా మూడో స్థానంలో గుజరాత్ టైటాన్స్ (+0.228) ఉంది.
నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోగా ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉండగా పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే.. ఆ రెండు జట్లు కూడా ఇప్పటి వరకు చెరో 11 మ్యాచ్‌లు ఆడాయి. 6 మ్యాచ్‌ల్లో గెలవగా మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి.
ఇరు జట్ల ఖాతాల్లోనూ 12 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేటు మెరుగ్గా ఉన్న చెన్నై (+0.185) పట్టికలో ఐదో స్థానంలో ఉండగా రాజస్థాన్ (+0.082)ఆరో స్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుసగా కేకేఆర్ 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఏడో స్థానంలో 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఢిల్లీ జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక ముంబై, లక్నో జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
టాప్-4లో నిలిచేందుకు ఏ జట్టు అవకాశం ఎలా ఉందంటే..?
సాంకేతికంగా 8 జట్లు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నప్పటికి కూడా ఆరు జట్ల మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. తొలి మూడు స్థానాల్లో ఉన్న ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ , గుజరాత్‌లు తలా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గత సీజన్లను పరిశీలిస్తే 16 పాయింట్లు సాధించిన జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించుకున్నాయి. ఈ లెక్కన ఈ మూడు జట్లు తాము ఆడాల్సిన మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటాయి. అయితే.. టాప్-2లో నిలవాలంటే మాత్రం సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి.
నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్‌కు సైతం ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు మంచి అవకాశం ఉంది. ఇంకా ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఇంకోవైపు సీఎస్‌కే, ఆర్ఆర్ జట్లు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌లో అడుగుపెడతాయి.
ఇక కేకేఆర్ కూడా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టవచ్చు ఇంకా ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అన్నింటిలో విజయం సాధిస్తే అప్పుడు కేకేఆర్ ఖాతాలో 17 పాయింట్లు ఉంటాయి. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతే. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ సాంకేతికంగా మాత్రమే ప్లేఆఫ్స్‌రేసులో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచినా కూడా ప్లేఆఫ్స్‌కు చేరడం కష్టమే. ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చాలా అంశాలు కలిసి రావాల్సి ఉంటుంది.
