Suryakumar Yadav : ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్.. సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వచ్చే ఏడాది చూసుకుంటాం.. ఈ ఏడాది..
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించడం పై ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Mumbai Indians out of IPL 2026 playoffs race Suryakumar Yadav comments viral (pic credit@ipl)
- ఆర్సీబీ చేతిలో ఓటమి
- ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్
- ఆవేదన వ్యక్తం చేసిన తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav : ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కథ ముగిసింది. ఆదివారం రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో ముంబైకి ఇది ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం. ఈ సీజన్లో ముంబై ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇక అవి నామమాత్రం కానున్నాయి. గెలిచినా ఓడినా ముంబైకి ఎలాంటి నష్టం లేకపోయినప్పటికి కూడా.. మిగిలిన జట్ల ప్లేఆఫ్స్ ఆశలను గల్లంతు చెయొచ్చు. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించడం పై తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తిలక్ వర్మ (57; 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నమన్ దీర్ (47; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్, రొమారియో షెపర్డ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం కృనాల్ పాండ్యా (73; 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో 167 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ నాలుగు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఘజన్ఫర్, రాజ్ బవా లు చెరో వికెట్ సాధించారు.
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం అని అన్నాడు. ఈ సీజన్ నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకున్నామని చెప్పుకొచ్చాడు. తప్పులను సరిదిద్దకుని వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామన్న ధీమాను వ్యక్తం చేశాడు.
ఇక ఆఖరి ఓవర్‌ను యువ ఆటగాడు రాజ్ బవాకు ఇవ్వడంపై మాట్లాడుతూ.. గతేడాది నుంచి అతడు తన బౌలింగ్ పై శ్రమిస్తున్నాడని తెలిపాడు. ఈ ఏడాది అతడిని చూస్తే ఓ విభిన్నమైన ఆల్‌రౌండర్‌గా కనిపించాడని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ఆఖరి ఓవర్ బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నాడు. దాదాపుగా విజయాన్ని అందించినంత పని చేశాడని అయితే ఆఖరికి గెలుపుకు కాస్త దూరంలో నిలిచామని తెలిపాడు. ఏదీఏమైనప్పటికి అతడు చాలా చక్కగా బౌలింగ్ చేశాడన్నాడు.
10 నుంచి 15 పరుగులు తక్కువ చేశాం..
తమ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ తాము 10 నుంచి 15 పరుగులు తక్కువగా చేశామన్నాడు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం తమ కొంపముంచిందన్నాడు. నమన్ ధీర్, తిలక్ వర్మలు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని తెలిపాడు. వారిద్దరు గొప్ప పట్టుదలను ప్రదర్శించారన్నాడు. ఇక ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ అందుకోవడం కోసం తిలక్, నమన్ ధీర్‌లు ఇద్దరూ కాస్త తడబడడం గురించి మాట్లాడుతూ ఆటలో ఇలాంటివి సహజం అని తెలిపాడు. అయితే.. ఆ తరువాత తిలక్ పట్టిన క్యాచ్ అద్భుతం అని కొనియాడాడు.
ఇక ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించడం పై మాట్లాడుతూ.. మిగిలిన మ్యాచ్‌ల్లో తమకు ఇష్టమైన క్రికెట్ ను ఆస్వాదిస్తామని చెప్పాడు. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించాడు. పాయింట్ల పట్టికలో ఆఖరులో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపాడు.
