Rajat Patidar : అతడే మా కొంపముంచాడు.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక వ్యాఖ్యలు..
వైభవ్ సూర్య వంశీ అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 11, 2026 / 07:20 AM IST
IPL 2026 RR vs RCB Rajat Patidar comments after Royal Challengers Bengaluru lost match against Rajasthan Royals (pic credit@ipl)
- ఈ సీజన్‌లో ఓటమి రుచి చూసిన ఆర్‌సీబీ
- రాజస్థాన్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం
- వైభవ్ తమ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడన్న ఆర్‌సీబీ కెప్టెన్
Rajat Patidar : ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఓటమి రుచి చూసింది. శుక్రవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వైభవ్ సూర్య వంశీ అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు.
రజత్ పాటిదార్ (63; 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థశతకం చేయగా, విరాట్ కోహ్లీ (32; 16 బంతుల్లో 7 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మలు తలా రెండు వికెట్లు తీశారు. సందీప్ శర్మ, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత వైభవ్ సూర్యవంశీ (78; 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (81 నాటౌట్; 43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు.
ఇక మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ ఓటమిపై రజత్ పాటిదార్ స్పందించాడు. ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికి కూడా కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయని అన్నాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడామని, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికి కూడా 202 పరుగులు చేశామన్నాడు. అదే విధంగా పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేసిన తీరు తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నాడు.
గత మ్యాచ్‌లలో మేము ఆడిన విధానం చాలా అద్భుతంగా ఉందన్నాడు. ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయన్నాడు. సుయాజ్‌ను ఆడించకపోవడంపై మాట్లాడుతూ.. బౌలింగ్ మార్పుల గురించి తాను పెద్దగా ఆలోచించలేదన్నాడు. ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్, షెపర్డ్, కృనాల్‌లతోనే ఓవర్లను మేనేజ్ చేయాల్సి వచ్చిందన్నాడు. దీని వల్ల మ్యాచ్ పై పెద్దగా ఏమీ ప్రభావం చూపలేదన్నాడు. ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలను నేర్చుకుని ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు. తదుపరి మ్యాచ్‌కు బలంగా తిరిగి వస్తామని తెలిపాడు.
