Babar Azam : టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్.. క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీల రికార్డులు బ్రేక్..
పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ (Babar Azam ) అరుదైన ఘనత సాధించాడు.
Babar Azam Creates history becoming fastest player to reach 12000 runs in T20 cricket
- టీ20 క్రికెట్లో బాబర్ ఆజామ్ అరుదైన ఘనత
- 12వేల పరుగుల మైలురాయి
- అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి
Babar Azam : పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 12 వేల పరుగుల మైలురాయిని సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో భాగంగా గురువారం కరాచీ వేదికగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ తరుపున ఆడుతూ బాబర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించాడు. బాబర్ టీ20 కెరీర్లో ఇది 351వ మ్యాచ్ కాగా 338వ ఇన్నింగ్స్.
ఈ క్రమంలో అతడు క్రిస్ గేల్‌ను అధిగమించాడు. 343 ఇన్నింగ్స్‌ల్లో గేల్ టీ20 క్రికెట్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. కోహ్లీ 360 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించాడు.
ఇదిలా ఉంటే.. టీ20 క్రికెట్లో 12 వేల పరుగుల మైలురాయిని దాటిన రెండో పాకిస్థాన్ ప్లేయర్‌గా బాబర్ నిలిచాడు. అతడి కంటే ముందు షోయబ్ మాలిక్ మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ 51 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. కుసల్ మెండీస్ (109; 52 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కరాచీ కింగ్స్ జట్టు 16.1 ఓవర్లలో 87 పరుగులకు కుప్పకూలింది.
