Yuvraj Singh : అడిగాడు కదా అని ఆటోగ్రాఫ్‌తో కూడిన షర్టును ఇస్తే చెత్త బుట్టలో పడేశాడు.. స్టువర్ట్ బ్రాడ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించిన యువీ..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
Stuart Broad Throwing Yuvraj Singh Signed Jersey In The Dustbin
- స్టువర్ట్ బ్రాడ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన యువీ
- స్టువర్ట్ తండ్రి క్రిస్ బాడ్ తనను కలిసి ఆటోగ్రాఫ్‌తో కూడిన షర్టు ఇవ్వాలని కోరాడట
- తాను ఇచ్చిన షర్టును స్టువర్ట్ బ్రాడ్ చెత్త బుట్టలో పడేసినట్లు తనకు తెలిసినట్లు వెల్లడించిన యువీ
Yuvraj Singh : టీ20 ప్రపంచకప్ 2007 విజేతగా భారత్ నిలిచింది. ఈ టోర్నీ గురించి వస్తే.. తప్పకుండా యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు గుర్తుకు రావడం సహజం. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో యువీ ఆరు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో యువీ (Yuvraj Singh) కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ఈ ఓవర్‌కు ముందు ఆండ్రూ పింట్లాఫ్, యువీ మధ్య ఏదో విషయంపై గొడవ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఇన్నింగ్స్‌తో యువరాజ్ సింగ్ పేరు మారుమోగిపోయింది. అదే సమయంలో బాధితుడు స్టువర్ట్ బ్రాడ్ కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ గొప్ప క్రికెటర్‌గా ఎదిగిన బ్రాడ్ టెస్టుల్లో 600 పైగా వికెట్లు తీసి ఇంగ్లాండ్ అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా ఎదిగాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 2007 టీ20 ప్రపంచకప్ తరువాత ఓ సందర్భంలో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్.. యువీని కలిసి తన కొడుకు కోసం జెర్సీ పై సంతకం చేసి ఇవ్వాలని కోరినట్లుగా చెప్పాడు. తాను ఇచ్చిన జెర్సీని స్టువర్ట్ బ్రాడ్ చెత్త బుట్టలో పడేసినట్లుగా తెలిసిందన్నాడు.
అతడి కోపంలో న్యాయముంది
‘అప్పుడు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు స్టువర్ట్ తండ్రి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీగా ఉన్నాడు. ఆయన నా వద్దకు వచ్చి మీరు నా కొడుకు కెరీర్‌ను దాదాపుగా ముగించేశారు అని అన్నాడు. అప్పుడు నేను.. సార్ నా బౌలింగ్‌లో కూడా ఒకరు ఐదు సిక్సర్లు కొట్టారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు అని చెప్పాను. అప్పుడు ఆయన మీరు స్టువర్ట్ కోసం ఒక షర్ట్ పై సంతకం చేసి ఇవ్వండి అని కోరాడు.
నేను వెంటనే జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో పాటు ఇలా రాశాను.. నా బౌలింగ్‌లో కూడా ఐదు సిక్సర్లు కొట్టారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నవ్వు అత్యుత్తమ ఆటగాడిగా ఎదరగాలని కోరుకుంటున్నాను అని రాశాను. క్రిస్ ఆ షర్టును వెళ్లి తన కొడుకు స్టువర్ట్‌కు ఇచ్చాడు. అయితే.. అతడు దాన్ని చెత్త బుట్టలో పడేసినట్లు తెలిసింది. అతడు నాపై అంత కోపంగా ఉన్నాడు. అతడి కోపంలో కూడా న్యాయం ఉన్నట్లుగా నాకు అనిపించింది అని యువీ అన్నాడు.
