Pat Cummins : ఇషాన్ కిషన్ కెప్టెన్సీ పై పాట్ కమిన్స్ హాట్ కామెంట్స్.. సందేహం ఉండేది.. నా 10 ఏళ్ల అనుభవంతో..
రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించడం పట్ల పాట్ కమిన్స్ (Pat Cummins ) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 26, 2026 / 10:27 AM IST
IPL 2026 RR vs SRH Pat Cummins comments after Sunrisers Hyderabad beat Rajasthan Royals (pic credit@ipl)
- రాజస్థాన్ రాయల్స్ పై ఎస్ఆర్‌హెచ్ గెలుపు
- ఆనందాన్ని వ్యక్తం చేసిన పాట్ కమిన్స్
- రీ ఎంట్రీలో రాణించడం పట్ల సంతోషం
Pat Cummins : ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం పై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అదే సమయంలో తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో మంచి ప్రద్శన చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (103; 37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు) శతక్కొట్టాడు. హైదరాబాద్ బౌలర్లలో మలింగ రెండు, ప్రఫుల్ హింగే, పాట్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం 229 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (74; 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (57; 29 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ లు చెరో రెండు వికెట్లు తీయగా డోనోవన్ ఫెరీరా ఓ వికెట్ పడగొట్టాడు.
ఇక మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడాడు. గాయం తరువాత రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అవును నిజమే రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రీ ఎంట్రీ తరువాత తొలి మ్యాచ్ ఇదే. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతానో అని చిన్న సందేహం ఉండేది. కానీ నా ప్రిపరేషన్ చాలా బాగుంది. 10 ఏళ్ల క్రితం నేను కెరీర్ ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు నాకున్న అనుభవంతో త్వరగానే టచ్‌లోని వచ్చాను అని పాట్ కమిన్స్ అన్నాడు.
ఇక మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదు అవుతుండడంతో బౌలర్లు ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురుకాగా.. తనకు తెలియదని, ఇక బౌలర్లు కూడా బ్యాటింగ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలేమో అని నవ్వుతూ చెప్పాడు. మ్యాచ్‌ల్లో స్కోర్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, దీని వల్ల ప్రయోజనం కూడా ఉందన్నాడు. ఒకటి లేదా రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికి కూడా బౌలర్లు మళ్లీ పుంజుకుని మ్యాచ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. ప్రపుల్ హింగే విషయంలో ఇదే జరిగిందన్నాడు. టీ20 క్రికెట్ సాగుతున్న తీరు నిజంగా చాలా సరదాగా ఉందని చెప్పుకొచ్చాడు.
ఇషాన్ కెప్టెన్సీ గురించి..
తన గైర్హాజరీలో ఇషాన్ కిషన్ నాయకత్వం వహించడంపై మాట్లాడుతూ.. అతడు జట్టును అద్భుతంగా నడిపించాడని అన్నాడు. యువ బౌలర్లతో మంచి ఫలితాలు రాబట్టాడు అని చెప్పుకొచ్చాడు. యువ బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని మెచ్చుకున్నాడు. వారికి స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ స్కోరు 250 దాటి ఉంటే తమకు కష్టమయ్యేదని, 220 పరుగులే చేయడంతో తాము చాలా ప్రశాంతంగా ఉన్నామన్నాడు. ఒక ఓవర్‌కు 10 పరుగులు చేయడం ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లకు పెద్ద కష్టమేమీ కాదన్నాడు. ప్రస్తుతం జట్టు చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉందన్నాడు. ఇది నిజంగా మంచి విజయం అని కమిన్స్ తెలిపాడు.
