Amit Mishra : రోజుల తరబడి తిండిపెట్టేవాడు కాదు.. తాగొచ్చి కొట్టేవాడు.. ఐపీఎల్ క్రికెటర్ అమిత్ మిశ్రా పై భార్య ఫిర్యాదు
అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఐపీఎల్ క్రికెటర్ అమిత్ మిశ్రా పై (Amit Mishra ) అతడి భార్య గరిమా తివారీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్ఫూర్ కోర్టులో ఫిర్యాదు చేసింది.
- Thota Vamshi Kumar
- Published On : March 10, 2026 / 02:48 PM IST
IPL Cricketer Amit Mishra Wife Files Dowry Abuse Complaint
Amit Mishra : అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఐపీఎల్ క్రికెటర్ అమిత్ మిశ్రా పై అతడి భార్య గరిమా తివారీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్ఫూర్ కోర్టులో ఫిర్యాదు చేసింది. పెళ్లైన తరువాత తన భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు నిరంతరం శారీరక, మానసికంగా తనను వేదిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. మిశ్రాతో పాటు, అతని తల్లి బీనా మిశ్రా, తండ్రి శశికాంత్ మిశ్రా, సోదరుడు అమర్ మిశ్రా, వదిన రీతు మిశ్రా, సోదరి స్వాతి మిశ్రాలను సహ నిందితులుగా పేర్కొంది.
మోడల్ అయిన గరిమాతో అమిత్ మిశ్రాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 2019లో పరిచయం అయింది. రెండేళ్ల పాటు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారు. చివరికి 26 ఏప్రిల్ 2021లో కాన్పూర్‌లోని వివాహం చేసుకున్నారు.
ఇక వివాహం అయిన వెంటనే అమిత్ మిశ్రాతో పాటు అత్త మామలు అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించినట్లు గరిమా మీడియాతో చెప్పింది. హోండా సిటీ కారుతో పాటు 10 లక్షల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపింది. అంతేకాకుండా అమిత్ మిశ్రా కొన్నిసార్లు తాగొచ్చి తనను కొట్టేవాడని, రోజుల తరబడి తిండి పెట్టకుండా వేధించాడని ఆరోపించింది.
మోడలింగ్ ద్వారా తాను సంపాదించిన డబ్బును అతడు లాక్కున్నాడని, విడాకులు తీసుకుంటానని పదే పదే బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది. వీరి వేధింపుల కారణంగా మోడలింగ్ వృతిని వదులు కోవడంతో పాటు పూర్తి నిరాశలో కూరుకుపోయినట్లుగా చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే గతంలో ఓ సారి ఆత్మహత్యకు యత్నించానని తెలిపింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు గతంలో అనేక సార్లు పోలీసుల వద్దకు వెళ్లినప్పటికి కూడా తన భర్త పలుకుబడి కారణంగా కేసు నమోదు చేయలేదని ఆరోపించింది. అందుకనే తాను కోర్టును ఆశ్రయించినట్లు చెప్పింది.
