Gautam Gambhir : వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికలను వెల్లడించిన గౌతమ్ గంభీర్.. రోహిత్, కోహ్లీల గురించి ఏమన్నాడంటే..?
తమ తదుపరి లక్ష్యం 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే అని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir ) వెల్లడించాడు.
Team India Head Coach Gautam Gambhir Reveals 2027 ODI World Cup Blueprint
- ఇక మా టార్గెట్ వన్డే ప్రపంచకప్ 2027 గెలవడమే
- ఐపీఎల్ 2026 ముగిసే నాటికి బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తాం
- దక్షిణాఫ్రికాలో ఆడడం అంత ఈజీ కాదన్న గంభీర్
Gautam Gambhir : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి పొట్టి కప్పును ముద్దాడింది. ఇక తమ తదుపరి లక్ష్యం 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే అని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. ఈ మెగాటోర్నీకి సంబంధించిన బ్లూ ప్రింట్‌ను ఐపీఎల్ 2026 ముగిసే నాటికి సిద్ధం చేస్తామని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం తాము కొంత విశ్రాంతి తీసుకుంటామని, ఆ తరువాత వన్డే ప్రపంచకప్ కోసం సిద్ధం అవుతామన్నాడు. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే దేశాలు సంయుక్తంగా వన్డే ప్రపంచకప్ 2027కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్కడ బౌన్సీ పిచ్‌లు ఉంటాయని భావిస్తున్నారు. ఈక్రమంలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆడే ప్లేయర్లను గుర్తించడమే ఇప్పుడు తమ ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం అని గంభీర్ తెలిపాడు. ఐపీఎల్ 2026 ముగిసే నాటికి ఓ ప్రణాళికను, వ్యూహాలను సిద్ధం చేసుకుంటామని వెల్లడించాడు.
IPL 2026 : ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీ మారిపోయింది.. రెండు రోజుల ఆలస్యంగా.. కొత్త తేదీ ఎప్పుడంటే..?
ఐపీఎల్ 2026 తర్వాత 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఐపీఎల్ ముగిసిన తరువాత వన్డే ప్రపంచకప్ 2027 ఆరంభానికి ముందు భారత జట్టు 25 నుంచి 30 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇటీవల కాలంలో ఈ పార్మాట్లో టీమ్ఇండియా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. మనం ఎంత త్వరగా ప్రణాళికలను ప్రారంభిస్తే అంత మంచిది. అని గంభీర్ అన్నాడు.
ఇక దక్షిణాఫ్రికాలో మ్యాచ్‌లు ఆడడం అంత తేలిక కాదు. మనం కాంబినేషన్లను గుర్తించి, పరిస్థితులకు తగిన ఆటగాళ్లను గుర్తించాలి. సెలెక్టర్లు, కోచ్‌లు ఆ పని చేస్తారు. ఐపీఎల్ 2026 ముగిసే సమయానికి.. భారతదేశం 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ఒక బ్లూప్రింట్‌ను కలిగి ఉంటుంది. అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారా?
టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 గెలవడమే తమ లక్ష్యం అని పలు సందర్భాల్లో వీరిద్దరు చెప్పుకొచ్చారు. అయితే.. వన్డే ప్రపంచకప్ సమయానికి రోహిత్‌కు 40 ఏళ్లు, కోహ్లీకి 39 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు వీరిద్దరు ఫిట్‌గా ఉండి ఫామ్‌లో ఉంటారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల వీరిద్దరు కూడా చాలా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. అయినప్పటికి కూడా ఐపీఎల్ 2026లో తన ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇకపై తాము ఆడే మ్యాచ్‌ల్లో తప్పక రాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జట్టులో చోటు కోసం కుర్రాళ్ల నుంచి వీరికి గట్టి పోటీ ఉంది.
ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉన్నారా? లేరా? అన్న విషయాన్ని గంభీర్ చెప్పడం లేదు. భారత జట్టు ఇప్పట్లో వన్డేలు ఆడదు. ఐపీఎల్ ముగిసిన తరువాత జూన్‌లో ఆడనుంది. అఫ్గానిస్థాన్‌తో జూన్ 14 నుంచి భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సమయానికి కోహ్లీ, రోహిత్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
