KKR షారూఖ్ ఖాన్‌కు మెసేజ్ చేస్తా: యువరాజ్

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఐపీఎల్ వేలానికి క్రిస్ లిన్ ను విడిచిపెట్టేయడం మంచి నిర్ణయం కాదని అంటున్నాడు. ఈ విషయం గురించి షారూఖ్ ఖాన్ కు మెసేజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020 వేలానికి ముందుగానే ఫ్రాంచైజీలన్నీ ప్లేయర్లను విడిచిపెట్టేస్తున్నాయి. 

ఆదివారం ముంబై ఇండియన్స్ సైతం యువరాజ్ సింగ్‌తో సహా 12మంది ప్లేయర్లను వేలానికి వదిలేసింది. ఆ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ కూడా క్రిస్ లిన్ ను తమ జట్టు నుంచి వేలానికి వదిలేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై స్పందించిన యువీ.. ‘క్రిస్ లిన్ ప్రస్తుతం చక్కటి ఫామ్ లో ఉన్నాడు. నమ్మశక్యం కాని షాట్ లతో రెచ్చిపోతున్నాడు’ అని అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా మరాఠా అరేబియన్స్‌తో మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. 

‘ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడి శుభారంభాన్ని అందించాడు. నిజంగా నాకు అర్థం కావడం లేదు. వాళ్లెందుకు అంటిపెట్టుకోకుండా వేలానికి వదిలిపెట్టారోనని. ఇది కోల్‌కతా తీసుకున్న చెడ్డ నిర్ణయం. దీనిపై షారూఖ్ ఖాన్ కు మెసేజ్ చేస్తా. క్రిస్ ప్రస్తుతం అద్భుతంగా ఆడుతున్నాడు’ అని తెలిపాడు. 

తన ఆట గురించి మాట్లాడుతూ.. నేనింకా కొన్నేళ్లుగా మాత్రమే ఆడతాను. త్వరలోనే కోచింగ్ వైపు వెళ్లిపోదామనుకుంటున్నా. నన్ను వెన్నునొప్పి బాధిస్తోంది. తీవ్రంగా పోరాడగల సత్తా నాకు లేదు. మానసికంగా చిన్నవాడిలా ఫీలవుతున్నా. శరీరం సహకరించడం లేదు’ అని యువరాజ్ ముగించాడు.