Jay Shah : ప్రపంచ క్రికెట్‌లో జై షా హవా.. ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి ఎన్నిక! నెక్ట్స్ టార్గెట్ ఇదే..!
ICC Chairman Jay Shah : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా మరోసారి ఎన్నికయ్యారు.
- Harish Thanniru
- Published on- November 16, 2026 / 03:59 PM IST
Jay Shah re elected as ICC chairman for second term
ICC Chairman Jay Shah : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా మరోసారి ఎన్నికయ్యారు. రెండోసారి కూడా ఆయనకే బాధ్యతలు అప్పగిస్తూ ఐసీసీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో జై షా పేరును డైరెక్టర్లు ప్రతిపాదించగా.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మరో రెండేళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌లో కీలక బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు.
Also Read : Chiranjeevi: ఏఐ మోసాలపై కఠిన చర్యలు తీసుకోండి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చిరంజీవి వినతిపత్రం
ఈ సందర్భంగా డైరెక్టర్లకు జై షా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్‌గా కొనసాగడం తనకు గౌరవంతోపాటు బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి సభ్య దేశాలతో కలిసి పనిచేస్తా. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం కొత్త ప్రేక్షకులను ఆకర్షించడానికి, యువతలో ఈ ఆటపై ఆసక్తిని పెంచడానికి గొప్ప అవకాశం. క్రికెట్ భవిష్యత్తును మరింత బలోపేతం చేయడంతో పాటు.. ఆటగాళ్లు, అభిమానులు, వాణిజ్య భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు.’’
జైషా ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో ఉన్నారు. 2024 ఆగస్టులో తొలిసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆయన.. అదే ఏడాది డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఆయన వయసు 35 ఏళ్లు మాత్రమే. దీంతో ఐసీసీ చరిత్రలో అత్యంత చిన్న వయసులో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతకుముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా పనిచేశారు.
జై షా రెండోసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్న వన్డే ప్రపంచకప్‌తో పాటు.. 2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనానికి సంబంధించిన ఏర్పాట్లు ఆయన పదవీకాలంలోనే జరగనున్నాయి. వందేళ్లకుపైగా విరామం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటుదక్కడం ఈ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెంచే అవకాశంగా ఐసీసీ భావిస్తోంది. ముఖ్యంగా కొత్త దేశాల్లో క్రికెట్‌ను విస్తరించడం, మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడం, అసోసియేట్ దేశాలకు మరిన్ని అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ఐసీసీ దృష్టి సారించనుంది.
